బీజింగ్: చైనా రహస్యంగా అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందని, ముఖ్యంగా ఈ నెలలోనే అత్యధిక సంఖ్యలో పరీక్షలు చేపట్టిందని అమెరికా బహిరంగంగా ఆరోపించింది.
వాణిజ్య, ఆర్థిక రంగాల్లో అమెరికా ఆధిపత్యానికి సవాలు విసిరిన చైనా, ఇప్పుడు సైనిక శక్తిలోనూ అమెరికాకు గట్టి పోటీనిస్తోంది. ముఖ్యంగా చైనా ‘కొత్త తరం అణ్వాయుధాలను’ తయారు చేస్తోందని సమాచారం. 2020 నుండి 2026 మధ్య ఈ ఆరేళ్ల కాలంలో చైనా కనీసం ఒక్కసారైనా అణు పరీక్ష నిర్వహించి ఉండవచ్చని ఇజ్రాయెల్ వార్తా సంస్థ ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ పేర్కొంది. 2020 జూన్‌లో చైనా జరిపిన పరీక్షల సమాచారాన్ని అమెరికా నిఘా సంస్థలు విశ్లేషించగా, చైనా అత్యంత అధునాతన అణ్వాయుధాలను రూపొందిస్తోందని తేలింది.
నివేదికలోని ముఖ్యాంశాలు: అమెరికా నిఘా వర్గాల నివేదిక ప్రకారం, చైనా అత్యాధునిక ఆయుధాలను తయారు చేయాలనుకుంటోంది. ఇందులో ఒకే క్షిపణి ద్వారా అనేక చిన్న అణు బాంబులను ప్రయోగించగల వ్యవస్థలు (MIRV), మరియు చైనా ఇప్పటివరకు రూపొందించని సరికొత్త అణ్వాయుధాలు ఉన్నాయి. ఒకవేళ తైవాన్‌పై దాడి జరిగినప్పుడు అమెరికా గనుక స్పందిస్తే, ఈ అణ్వాయుధాలను చైనా ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం.
చైనా స్పందన: ఈ ఆరోపణలపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియు పెంగ్యు స్పందిస్తూ.. అమెరికా కావాలనే చైనా అణు విధానంపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి, తన అణ్వాయుధాలను తగ్గించుకోవాల్సిన బాధ్యత నుండి తప్పించుకోవడానికి చేస్తున్న ‘రాజకీయ కుట్ర’ ఇది అని ఆయన కొట్టిపారేశారు. 2020లో అణు పరీక్షలు జరిగాయన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆయన స్పష్టం చేశారు.
