తమిళనాడులోని ఈరోడ్ జిల్లా అంతియూర్ సమీపంలోని కొండ ప్రాంతంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని దుండగుడు అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం, ఆగ్రహావేశాలను రేకెత్తించింది.
కరుంబారై గ్రామంలోని ఒక తోట ఇంట్లో 85 ఏళ్ల బామ్మ ఒంటరిగా నివసిస్తోంది. ఆమె భర్త గతంలోనే మరణించగా, కుమారుడు, కుమార్తె పెళ్లయి వేర్వేరుగా జీవిస్తున్నారు.
రోజూలాగే రాత్రి తలుపులు వేసుకుని నిద్రిస్తున్న సమయంలో, అర్ధరాత్రి ఇంట్లోకి అక్రమంగా చొరబడిన ఒక కామాంధుడు వృద్ధురాలి నోరు నొక్కి అత్యంత కిరాతకంగా ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు.
మరుసటి రోజు ఉదయం బంధువులు వచ్చి చూసేసరికి.. వృద్ధురాలు బట్టలు చిరిగిపోయి, రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటం చూసి షాక్కు గురయ్యారు. వెంటనే ఆమెను రక్షించి అంతియూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఈరోడ్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ పరారీలో ఉన్న కామాంధుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ముమ్మరంగా గాలిస్తున్నారు.
