వర్షం ఆగనే లేదు. నెల రోజులుగా వరదల్లో మునిగిన నగరం. నడుము లోతు నీటిలో చర్చిలో జరిగిన పెళ్లి. ప్రేమకు సరికొత్త నిర్వచనం చెప్పిన జంట. భావోద్వేగానికి గురిచేస్తున్న వీడియో!

ఫిలిప్పీన్స్‌లో గత నెల రోజులకు పైగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి.

ఈ విపత్కర పరిస్థితుల్లోనూ, ప్రకృతి వైపరీత్యాన్ని లెక్కచేయకుండా ఒక యువ జంట నడుము లోతు వరద నీరు చేరిన చర్చిలోనే వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రేమ ముందు ప్రకృతే తలవంచక తప్పలేదని ఈ సంఘటన చాటిచెప్పింది.

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు ఉత్తరాన ఉన్న హగోనోయ్ నగరంలోని ప్రసిద్ధ ‘సెయింట్ జాన్ ది బాప్టిస్ట్’ చర్చిని గత నెల రోజులుగా వరద నీరు ముంచెత్తింది. ఈ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల లియాన్ లియెసా కాలాంగ్, గిల్బర్ట్ సీకోల వివాహం ఇక్కడే జరగాల్సి ఉంది.

ఎలాంటి పరిస్థితుల్లోనూ పెళ్లి తేదీని వాయిదా వేయకూడదని నిశ్చయించుకున్న ఆ జంట, చర్చి వరదల్లో మునిగిపోయినప్పటికీ ముందుగా నిర్ణయించిన ప్రకారమే అక్కడే వివాహం చేసుకోవాలని భావించింది. వరద ప్రమాదం దృష్ట్యా పెళ్లిని వాయిదా వేసుకోవాలని చర్చి నిర్వాహకులు సూచించినప్పటికీ, తమ ప్రేమపై ఉన్న నమ్మకంతో వారు వెనకడుగు వేయలేదు. వారి పట్టుదలను చూసి చర్చి యాజమాన్యం, స్థానికులు వివాహానికి పూర్తి సహకారం అందించారు.

వరద నీటిలో సురక్షితంగా నడవడానికి వధువు లియాన్ తన తెల్లటి వివాహ గౌను పొడవును తగ్గించుకుంది. చేతిలో తెల్లటి పూలగుత్తితో, నడుము లోతు గోధుమ రంగు బురద నీటిలో జాగ్రత్తగా నడుచుకుంటూ చర్చిలోకి ప్రవేశించింది. మరోవైపు వరుడు గిల్బర్ట్, వివాహానికి హాజరైన సుమారు 15 మంది సన్నిహితులు వరద నీటిలోనే నిలబడి ఈ వేడుకలో పాల్గొన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ నీటిలోనే నిలబడి నూతన దంపతులను ఆశీర్వదించారు.

సాధారణ సాంప్రదాయ వివాహాల కంటే భిన్నంగా, వరద నీటి నడుమ ఒక చిన్న ఉదయపు ప్రార్థనతో ఈ వివాహం ఘనంగా ముగిసింది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల వల్ల ఫిలిప్పీన్స్‌లో ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదకర పరిస్థితుల్లో, ఈ జంట చేసుకున్న వివాహం స్థానికులను ఎంతగానో కదిలించింది. మిడిల్ ఈస్ట్‌లో పనిచేస్తున్న వరుడు గిల్బర్ట్ మాట్లాడుతూ, వాస్తవానికి ఈ పెళ్లి డిసెంబరులో జరగాల్సి ఉందని తెలిపాడు. అయితే పరిస్థితుల రీత్యా ప్రస్తుతం ఇలాంటి విభిన్న వాతావరణంలో జరగడం వల్ల తమ పెళ్లి ఎప్పటికీ గుర్తిండిపోయే ఒక చారిత్రక ఘట్టంగా మారిందని పేర్కొన్నాడు.


Posted

in

by

Tags: