సాధారణంగా నవజాత శిశువులు 2.5 నుండి 3.5 కిలోల బరువు ఉంటారు. కానీ, న్యూయార్క్లో జన్మించిన షాన్ జూనియర్ ఏకంగా 5.9 కిలోల (13 పౌండ్ల) బరువుతో పుట్టి రికార్డు సృష్టించాడు. జనవరి 31న జన్మించిన ఈ బాబు బరువు చూసి ఆసుపత్రి సిబ్బందితో పాటు తల్లిదండ్రులు కూడా నోరెళ్లబెట్టారు. ఆ ఆసుపత్రి చరిత్రలో ఇప్పటివరకు పుట్టిన పిల్లలందరిలో ఇతనే అత్యంత బరువున్న బాబు.
తల్లిదండ్రుల ఆశ్చర్యం
టెరికా, షాన్ అనే దంపతులకు ఈ బాబు జన్మించాడు. బాబు కొంచెం పెద్దగానే పుడతాడని వైద్యులు ముందే హెచ్చరించినప్పటికీ, మరీ ఇంత బరువు ఉంటాడని తాము ఊహించలేదని తల్లి టెరికా పేర్కొంది. ఇప్పటికే నలుగురు పిల్లలకు తల్లి అయిన టెరికా.. ప్రస్తుతం షాన్ జూనియర్కు 3 నుండి 6 నెలల వయసున్న పిల్లలు వాడే డైపర్లను వాడుతున్నట్లు తెలిపింది. ప్రసవం అసాధారణంగా ఉన్నందున వైద్యులు, నర్సులు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.
ఒకే రోజు.. రెండు భిన్నమైన అద్భుతాలు
ఆసుపత్రి వర్గాలు ఫేస్బుక్లో షేర్ చేసిన ఒక చిత్రం నెటిజన్ల మనసు గెలుచుకుంది. అదే రోజున మార్గోట్ అనే మరో చిన్నారి కేవలం 1.8 కిలోల (3.96 పౌండ్ల) బరువుతో జన్మించింది. 5.9 కిలోల షాన్ జూనియర్ పక్కన, అతి తక్కువ బరువున్న మార్గోట్ను పడుకోబెట్టిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. “ప్రతి బిడ్డ ప్రత్యేకమే” అని చెప్పడానికి ఈ ఫోటో ఒక నిదర్శనమని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ప్రపంచ రికార్డు ఏంటి?
గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత బరువుతో జన్మించిన శిశువు రికార్డు 1879 నాటిది. అమెరికాలోని ఒహియోలో జన్మించిన ఆ శిశువు బరువు 9.98 కిలోలు (22 పౌండ్లు) మరియు పొడవు 28 అంగుళాలు. అయితే దురదృష్టవశాత్తు ఆ బాబు పుట్టిన 11 గంటలకే మరణించాడు.
