వైవాహిక జీవితంలో విడిపోయిన తర్వాత భార్యాభర్తల మధ్య జరిగే విడివిడి కలయికలు లేదా స్వల్పకాలిక సాన్నిహిత్యాలు.. గతంలో ఎదుర్కొన్న మానసిక వేధింపులను వాటంతట అవే క్షమించినట్లు (కండోనేషన్ ఆఫ్ క్రూయల్టీ) భావించలేమని కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
మానసిక వేధింపుల ఆధారంగా దిగువ కోర్టు భర్తకు మంజూరు చేసిన విడాకుల ఉత్తర్వులను సమర్థిస్తూ.. జస్టిస్ సబ్యసాచి భట్టాచార్య, జస్టిస్ సుప్రతీమ్ భట్టాచార్యలతో కూడిన ధర్మాసనం ఈ న్యాయ వివరణ ఇచ్చింది.
ఈ దంపతులు 2009 జూన్ 18న ప్రత్యేక వివాహ చట్టం (స్పెషల్ మ్యారేజ్ యాక్ట్) కింద వివాహం చేసుకున్నారు. వీరికి 2013 ఏప్రిల్‌లో ఒక సంతానం కలిగింది. కాలక్రమేణా దంపతుల మధ్య తలెత్తిన తీవ్ర విభేదాల కారణంగా 2014 నుంచే ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. ఆ తర్వాత భార్య తనను నిరంతరం మానసిక వేధింపులకు గురిచేస్తోందని పేర్కొంటూ భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడు.
తనపై, తన కుటుంబ సభ్యులపై భార్య నిరంతరం నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తోందని, వృద్ధాప్యంలో ఉన్న తల్లితో సంబంధాలు తెంచుకుని వేరు కాపురం పెట్టాలని ఒత్తిడి చేస్తోందని భర్త కోర్టులో వాదించాడు. ఈ పిటిషన్‌ను విచారించిన ఫ్యామిలీ కోర్టు 2021 డిసెంబర్‌లో భర్తకు అనుకూలంగా విడాకులు మంజూరు చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది.
అప్పీల్ విచారణ సమయంలో.. తాము విడిపోయిన తర్వాత కూడా తాను పలుమార్లు భర్త ఇంటికి వెళ్లి కలిసి ఉన్నానని, ప్రతిసారీ 7 నుండి 8 రోజుల పాటు అక్కడే గడిపానని భార్య వాదించింది. భార్యాభర్తలుగా కలిసి ఉన్నందున గతంలో జరిగిన వివాదాలన్నింటినీ భర్త క్షమించినట్లేనని, కాబట్టి విడాకులు రద్దు చేయాలని ఆమె కోరింది.
అయితే ఈ వాదనను హైకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. విడిపోయిన తర్వాత అనుకోకుండా ఏర్పడే శారీరక సంబంధం లేదా కొద్ది రోజుల తాత్కాలిక కలయికలు.. అంతకుముందు జరిగిన తీవ్ర వేధింపులను పూర్తిగా క్షమించినట్లుగా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా, క్షమాపణ అనేది బేషరతుగా ఉండదని, భవిష్యత్తులో మళ్లీ అలాంటి వేధింపులకు పాల్పడకూడదనే షరతుకు లోబడి ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది.
భార్య లేవనెత్తిన ఇతర ఆరోపణలను కూడా ధర్మాసనం పరిశీలించింది. అత్తగారిపై ఫిర్యాదులు, వరకట్న వేధింపులు, బలవంతపు గర్భస్రావం వంటి తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ.. వాటిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాధారాలు లేవని కోర్టు గుర్తించింది.
భర్త తన తల్లి వద్ద ఉండడాన్ని వ్యతిరేకిస్తూ వేరు కాపురం కోరడంలో ఆధునిక సమాజ మార్పులు ఉన్నప్పటికీ.. అది ఆధారాలు లేని తీవ్రమైన నిందారోపణల ఆధారంగా ఉండకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. అంతిమంగా, భర్తకు విడాకులు మంజూరు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అదే సమయంలో, అర్హత ఆధారంగా శాశ్వత భరణం (జీవనభృతి) కోసం చట్టపరమైన మార్గాల ద్వారా ప్రత్యేకంగా కోర్టును ఆశ్రయించే హక్కు భార్యకు ఉంటుందని స్పష్టం చేసింది.

Leave a Reply