తిరునెల్వేలి: తిరునెల్వేలిలోని పాళయంకోట ప్రాంతంలో పనిచేసే మహిళల కోసం ఒక ప్రైవేట్ వసతి గృహం (లేడీస్ హాస్టల్) ఉంది. ఇందులో ఉద్యోగం చేసే మహిళలు, కళాశాల విద్యార్థినులు నివసిస్తున్నారు. కొన్ని నెలల క్రితం నెల్లై టౌన్ సెంగుంతర్ నడు వీధికి చెందిన మకరజ్యోతి (39) అనే మహిళ, తాను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నానని చెప్పి తన పిల్లలతో కలిసి ఈ హాస్టల్లో చేరింది.
ఏం జరిగింది? ఇటీవల కాలంలో మకరజ్యోతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎక్కడికీ పనికి వెళ్లకుండా హాస్టల్లోనే ఉంటున్న ఆమె, రాత్రి వేళల్లో ఇతరుల గదుల్లోకి ప్రవేశించడం, మహిళలు స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ వైపు తిరగడం వంటి పనులు చేసేది. ఎప్పుడూ చేతిలో సెల్‌ఫోన్‌తో ఉండే ఆమె చర్యలు హాస్టల్లోని మహిళలకు అనుమానం కలిగించాయి.
మకరజ్యోతి అనుమానాస్పద చర్యలపై మహిళలు హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేశారు. వార్డెన్ రహస్యంగా నిఘా ఉంచినప్పుడు, మకరజ్యోతి హాస్టల్లోని ఇతర మహిళలను తన ఫోన్లో రహస్యంగా చిత్రీకరిస్తున్నట్లు గుర్తించారు. ఆమె ఫోన్‌ను పరిశీలించగా, మహిళలు నిద్రిస్తున్నప్పుడు, దుస్తులు సరిగా లేని సమయంలో ఆభ్యంతరకరంగా ఫొటోలు, వీడియోలు తీసినట్లు బయటపడింది.
విచారణలో బయటపడ్డ నిజాలు: ఈ ఆభ్యంతరకర ఫొటోలు, వీడియోలను కోయంబత్తూరుకు చెందిన కణ్ణన్ అనే వ్యక్తికి ఆమె పంపుతున్నట్లు తేలింది. దీనిపై హాస్టల్ వార్డెన్ పాళయంకోట ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ నాగకుమారి విచారణలో, మకరజ్యోతి తోటి మహిళలను ఆభ్యంతరకరంగా చిత్రీకరించి బయటి వ్యక్తికి పంపుతున్నట్లు నిర్ధారణ అయింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
విచారణలో మకరజ్యోతి షాకింగ్ నిజం ఒప్పుకుంది. తన అక్రమ సంబంధం ఉన్న మగ స్నేహితుడు కణ్ణన్, హాస్టల్ మహిళల వీడియోలను వివిధ కోణాల్లో తీసి పంపాలని ఆమెను ఒత్తిడి చేశాడని, అతడిని సంతోషపెట్టడానికే తాను ఈ ద్రోహానికి పాల్పడ్డానని ఆమె చెప్పింది.
నిందితుల అరెస్టు: మకరజ్యోతి అరెస్ట్ కాగానే కణ్ణన్ పరారీ అయ్యాడు. కోయంబత్తూరులోని పేరూర్ తాలూకా భారతియార్ పురంలో ఉంటున్న కణ్ణన్ కోసం నెల్లై సిటీ పోలీస్ కమిషనర్ దేశ్‌ముఖ్ శేఖర్ సంజయ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కోయంబత్తూరులో గాలించిన పోలీసులు, పరారీలో ఉన్న కణ్ణన్‌ను పట్టుకుని అరెస్టు చేశారు. అతడిని నెల్లైకి తీసుకువచ్చి, విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
