గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ 2004, అక్టోబర్ 18న ఎన్కౌంటర్లో హతమైన ఘటన భారత పోలీసు చరిత్రలో ఒక మరుపురాని అధ్యాయం.
తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల పోలీసులకు సింహస్వప్నంగా మారిన వీరప్పన్ సామ్రాజ్యానికి అంతం పలికిన ఆ సాహసోపేతమైన చర్యకు నాయకత్వం వహించిన మాజీ డీజీపీ విజయకుమార్ IPS కు 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ రంగంలో ఆయన అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ఈ పౌర పురస్కారాన్ని అందజేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
2026 పద్మ పురస్కారాల జాబితా
2026 ఏడాదికి గాను రాష్ట్రపతి ఆమోదం పొందిన పద్మ పురస్కారాల జాబితాలో మొత్తం 131 మందికి చోటు దక్కింది. ఇందులో:
- పద్మ విభూషణ్: 5 మంది
- పద్మ భూషణ్: 13 మంది
- పద్మశ్రీ: 113 మంది
ఈ జాబితాలో 19 మంది మహిళలు ఉన్నారు. అలాగే విదేశీయులు, ఎన్ఆర్ఐలు, భారత సంతతికి చెందిన వారు ఆరుగురు ఉండగా.. 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రకటించారు. ఈ జాబితాలో టీమ్ ఇండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు కూడా పద్మశ్రీ దక్కడం విశేషం.
వీరప్పన్ వేట – ఒక సవాల్
మాజీ డీజీపీ విజయకుమార్ పేరు పద్మశ్రీ జాబితాలో ఉండటం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పేరును భారత్‌లో అంత సులభంగా ఎవరూ మరచిపోలేరు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో దాక్కుని గంధపు చెక్కల స్మగ్లింగ్, ఏనుగుల వేట, పోలీసులపై దాడులకు పాల్పడుతూ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు వీరప్పన్ పెద్ద సవాల్‌గా మారాడు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత హయాంలో వీరప్పన్ వేటకు ముగింపు పలికేందుకు విజయకుమార్ నాయకత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (Special Task Force) ఏర్పాటైంది. ఈ బృందంలో ప్రస్తుత ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాతో పాటు పలువురు సీనియర్ అధికారులు ఉండేవారు. వీరప్పన్‌ను పట్టుకునే పూర్తి బాధ్యతను ప్రభుత్వం విజయకుమార్‌కు అప్పగించింది.
ఆపరేషన్ కోకూన్ విజయం
సుదీర్ఘ కాలం పాటు సాగిన గాలింపు చర్యల ఫలితంగా, 2004 ఆగస్టు 18న ధర్మపురి జిల్లా పాప్పిరెడ్డిపట్టి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో వీరప్పన్ మరియు అతని అనుచరులు హతమయ్యారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా, వీరప్పన్ అధ్యాయానికి ముగింపు పలికింది. ఈ ఆపరేషన్ అనుభవాలను వివరిస్తూ విజయకుమార్ ‘Veerappan – Chasing the Brigand’ అనే ఆంగ్ల పుస్తకాన్ని కూడా రాశారు.
తమిళనాడు పోలీసు శాఖలో డీజీపీ వంటి కీలక పదవుల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన విజయకుమార్ సేవలను కేంద్రం గుర్తించింది. వీరప్పన్ హతమై దాదాపు 25 ఏళ్లు కావస్తున్న తరుణంలో, ఆయన నాయకత్వ పటిమకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం విశేషం
