మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను ఆర్టీసీ బస్సులో అనాథలుగా వదిలేసి, తన తండ్రి ఇంట్లో నగదు మరియు స్కూటర్‌ను దొంగిలించి ప్రియుడితో కలిసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత బస్సు కండక్టర్ ఆ పిల్లలు ఏడవడం గమనించి, వారి జేబులో ఉన్న చేతిరాతతో కూడిన నోట్‌ను చూసి పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మహిళ తన పిల్లలను పంఢర్‌పూర్-సంభాజీనగర్ (Pandharpur-Sambhaji Nagar) బస్సులో కూర్చోబెట్టి, తన తండ్రి వద్ద దొంగిలించిన స్కూటర్‌పై ప్రియుడితో కలిసి పరారైంది. ఆ చిన్నారి జేబులో లభించిన లేఖలో: “ఈ పిల్లలకు తల్లిదండ్రులు లేరు. దయచేసి వీరిని యావత్మాల్ (Yavatmal) వెళ్లే బస్సులో ఎక్కించండి” అని రాసి ఉంది. అంతేకాకుండా దానిపై ఒక మొబైల్ నంబర్ కూడా ఉంది.
బీడ్ వద్ద బయటపడ్డ ఘోరం
బస్సు బీడ్ (Beed) ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లలు ఏడుస్తుండటం చూసి అనుమానం వచ్చిన కండక్టర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ లేఖలో ఉన్న మొబైల్ నంబర్‌కు పోలీసులు ఫోన్ చేయగా.. విచారణలో ఆ నంబర్ పిల్లల తాతయ్య (మహిళ తండ్రి) ది అని తేలింది.
తన కుమార్తె ఇంట్లో ఉన్న నగదు, తన స్కూటర్ తీసుకుని పారిపోయిందని ఆ వృద్ధుడు అంతకుముందే ఏప్రిల్ 30న యావత్మాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బస్సులో దొరికిన అనాథ పిల్లల కేసుతో ఈ దొంగతనం కేసుకు లింక్ కుదరడంతో, పోలీసులు ఆ వృద్ధుడిని బీడ్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.
పిల్లల కంటే స్కూటర్ పైనే తాతయ్య మోజు!
పోలీసుల కథనం ప్రకారం.. స్టేషన్‌కు వచ్చిన తాతయ్యకు ఆ నిరపరాధులైన పిల్లల కంటే, పోయిన తన స్కూటర్ గురించే ఎక్కువ ఆందోళన ఉన్నట్లు కనిపించింది. అంతేకాకుండా ఆ పిల్లలను తన వెంట తీసుకెళ్లడానికి (కస్టడీ తీసుకోవడానికి) ఆయన నిరాకరించాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ మైనర్ పిల్లల బాధ్యతను ప్రభుత్వ అధికారులే స్వీకరించాల్సి వచ్చింది.
ప్రస్తుతం బీడ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (Child Welfare Committee) మరియు జిల్లా యంత్రాంగం సహాయంతో ఆ పిల్లలను సురక్షితంగా ‘శిశుగృహ’ (Shishugriha) కు తరలించామని, అక్కడ వారికి అవసరమైన సంరక్షణ, ఆశ్రయం కల్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
