ఈ సమాజంలో మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని చాటిచెప్పే ఒక అద్భుతమైన ఘటన ఈక్వెడార్ దేశంలోని ‘శాంటో డొమింగో డి లాస్ సాచిలాస్’ ప్రాంతంలో చోటుచేసుకుంది.
అలసటతో నిద్రపోయిన ఓ వృద్ధుడి నిస్సహాయతను ఆసరాగా చేసుకుని జరిగిన దోపిడీ, ఆ తర్వాత డెలివరీ బాయ్స్ తెచ్చిన ఊహించని మలుపు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆ ప్రాంతానికి చెందిన ఒక నిరుపేద వృద్ధుడు తన రోజువారీ అవసరాల కోసం వీధుల్లో వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే బజారులో సరుకులను పెట్టుకుని విక్రయిస్తూ.. విపరీతమైన శారీరక అలసట తట్టుకోలేక ‘లాస్ రోసలెస్’ ప్రాంతంలో కాసేపు కన్నుమూసి నిద్రపోయాడు.
వృద్ధుడు నిద్రపోతుండటాన్ని గమనించిన ఓ కేటుగాడు.. అదును చూసి నయవంచనతో అక్కడికి వచ్చి, ఆయన అమ్మకానికి తెచ్చిన సరుకులన్నింటినీ ఊడ్చుకెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత నిద్రలేచి చూసిన ఆ వృద్ధుడు.. తన జీవనాధారమైన సరుకులన్నీ మాయమవడం చూసి దిక్కుతోచక నడిరోడ్డుపైనే గుండెలవిసేలా రోదించాడు.
రోడ్డు పక్కన నిలబడి ఆ పెద్దాయన కన్నీరుమున్నీరవుతుండటం చూసిన స్థానిక ఫుడ్/పార్శిల్ డెలివరీ బాయ్స్ వెంటనే ఆయన వద్దకు వచ్చి విషయం తెలుసుకున్నారు. కష్టపడి బతికే ఒక నిస్సహాయుడి కడుపు కొట్టిన ఆ దొంగను వదిలిపెట్టకూడదని నిర్ణయించుకుని, తక్షణమే ముమ్మర గాలింపు చేపట్టారు.
తమ బైక్‌లపై ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టిన డెలివరీ బాయ్స్.. కొద్ది నిమిషాల్లోనే ఆ దొంగ నక్కిన ఇంటిని కనిపెట్టారు. పదుల సంఖ్యలో డెలివరీ బాయ్స్ ఏకమై ఒక్కసారిగా ఆ ఇంటిని చుట్టుముట్టి నిలదీయడంతో దొంగ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తన చేతివాటం బట్టబయలైందని గ్రహించి, తప్పించుకునే దారిలేక తాను దొంగిలించిన సరుకులన్నింటినీ బయటకు తెచ్చి వృద్ధుడికి ఇచ్చేశాడు.
కష్టాల్లో ఉన్న వృద్ధుడికి అండగా నిలిచి, దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని సరుకులను తిరిగి ఇప్పించిన డెలివరీ బాయ్స్ సమయస్ఫూర్తిని, ఐక్యతను స్థానికులతో పాటు నెటిజన్లు వేనోళ్ల కొనియాడుతున్నారు.

Leave a Reply