అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య అంతకంతకూ పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పడానికి భారతదేశం తక్షణమే ముందుకు రావాలని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ బహిరంగంగా పిలుపునిచ్చారు.
ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు శాంతి అనేది చాలా అవసరమని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే చేసిన యుద్ధ విరమణ విజ్ఞప్తి సరైన సమయంలో తీసుకున్న నిర్ణయమని ఆయన ప్రశంసించారు.
ప్రస్తుతం ప్రపంచ వేదికపై అమెరికా మరియు ఇరాన్.. ఈ రెండు దేశాల నమ్మకాన్ని ఒకేసారి పొందిన ఏకైక బలమైన దేశంగా భారత్ నిలుస్తోంది. ఈ ప్రత్యేకమైన స్థానాన్ని ఉపయోగించుకుని, రెండు దేశాలను చర్చల మేజా వద్దకు తీసుకువచ్చి శాంతిని నెలకొల్పడం ఒక్క భారతదేశం వల్లే సాధ్యమవుతుందని ఫిన్లాండ్ అధ్యక్షుడు విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ చేపట్టే ఈ దౌత్య ప్రయత్నాలు ప్రపంచవ్యాప్త యుద్ధ ముప్పును నివారిస్తాయని అందరూ ఆశిస్తున్నారు.
