వేలూరు: వివాహితతో వివాహేతర సంబంధం కారణంగా, “నువ్వు నాకు మాత్రమే సొంతం” అని వాదిస్తూ, ఓ పెయింటర్‌ను ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన వేలూరు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది.
వేలూరు సమీపంలోని చతుప్పేరి ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ (42) అనే పెయింటర్ మరియు చిరుకాంచి ప్రాంతానికి చెందిన రాహుల్ (26) ఇద్దరూ తమ భార్యలకు దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. వీరిద్దరూ అదే ప్రాంతానికి చెందిన ఒక వివాహితతో సన్నిహితంగా ఉంటున్నారని సమాచారం. కాలక్రమేణా, ఆ మహిళతో వినోద్ కుమార్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రాహుల్‌తో మాట్లాడకూడదని ఆమెను వినోద్ కుమార్ హెచ్చరిస్తూ వచ్చాడు.
ఒకానొక దశలో వినోద్ కుమార్ సదరు మహిళ ఇంటికి వెళ్లి, “రాహుల్‌తో తిరగవద్దు, నువ్వు నాకు మాత్రమే సొంతం” అని గొడవకు దిగాడు. దాన్ని ఆమె వ్యతిరేకించి, ఇంటి నుండి వెళ్ళిపోవాలని హెచ్చరించింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రాహుల్, వినోద్ కుమార్ మధ్య వాగ్వాదం జరగగా, స్థానికులు వారిని విడదీసి పంపేశారు. అయితే, దీనితో పగ పెంచుకున్న రాహుల్, వినోద్ కుమార్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూశాడు.
ఆ రోజు రాత్రి సదరు మహిళ ఇంటి సమీపంలోని పొలంలో వినోద్ కుమార్ మద్యం తాగుతుండగా, రాహుల్ అక్కడికి చేరుకున్నాడు. మరోసారి గొడవకు దిగి, మద్యం మత్తులో ఉన్న వినోద్ కుమార్‌పై ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం గొంతులో పొడిచి దారుణంగా హత్య చేశాడు. చంపిన తర్వాత కూడా కోపం తగ్గని రాహుల్, “ఆమె నాకు మాత్రమే సొంతం” అని అరుస్తూ, ఆ రాడ్డును బావిలో పడేసి పరారయ్యాడు. మరుసటి రోజు రక్తపు మడుగులో పడి ఉన్న వినోద్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అరియూర్ పోలీసులు, కేసు దర్యాప్తు చేసి రాహుల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు.
