వాషింగ్టన్/ఇస్లామాబాద్: అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వెనుక సాగుతున్న దౌత్యపరమైన నాటకంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్.. స్వయంగా అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’ ఆమోదం పొందిన తర్వాతే వెలుగు చూసిందని ‘ది న్యూయార్క్ టైమ్స్’ రిపోర్ట్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
ఆ ఒక్క పోస్ట్‌తో మారిన సీన్!
గత మంగళవారం మధ్యాహ్నం షెహబాజ్ షరీఫ్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. “దౌత్య చర్చలు బలంగా, వేగంగా సాగుతున్నాయి. ఇరాన్‌కు విధించిన డెడ్‌లైన్‌ను మరో రెండు వారాలు పొడిగించండి” అంటూ ఆయన డొనాల్డ్ ట్రంప్‌ను కోరారు. ఆశ్చర్యకరంగా ఆ పోస్ట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ట్రంప్ కాల్పుల విరమణను ప్రకటించారు. అయితే, ఈ పోస్ట్ షరీఫ్ స్వయంగా రాసింది కాదని, వైట్ హౌస్ అధికారులే దీన్ని ముందుగా చూసి, ‘ఓకే’ చెప్పిన తర్వాతే ఆయన పోస్ట్ చేశారని తాజా రిపోర్ట్ వెల్లడించింది.
డ్రాఫ్ట్ హెడర్‌తో దొరికిపోయిన పాక్?
ఈ వ్యవహారం మరింత రసవత్తరంగా మారింది ఎందుకంటే.. షరీఫ్ పెట్టిన ఆ పోస్ట్‌లో మొదట “Draft – Pakistan’s PM Message on X” అనే హెడర్ కనిపించింది. అంటే, అమెరికా పంపిన డ్రాఫ్ట్‌ను పాక్ ప్రధాని కార్యాలయం యాజ్ ఇట్ ఈజ్ (As it is) గా కాపీ పేస్ట్ చేసిందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. అయితే, ఈ మెసేజ్‌ను ట్రంప్ స్వయంగా రాశారనే వార్తలను వైట్ హౌస్ తోసిపుచ్చింది.
ట్రంప్ మాస్టర్ ప్లాన్.. అంతా ఒక నాటకమా?
ఒకవైపు ఇరాన్ మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తూనే.. మరోవైపు తెరవెనుక పాకిస్థాన్‌ను పావుగా వాడుకుంటూ దౌత్యపరమైన సందు కోసం వెతికారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. “ఇది వాషింగ్టన్కు దక్కిన సంపూర్ణ విజయం. 100 శాతం సక్సెస్ అయ్యాం” అంటూ ప్రకటించారు.
ఇరాన్ 10 పాయింట్ల ఫార్ములా
ఇరాన్ పంపిన 10 పాయింట్ల శాంతి ప్రతిపాదన చర్చలకు అనుకూలంగా ఉందని ట్రంప్ అంగీకరించారు. ఒకవేళ చర్చలు విఫలమైతే పాత బెదిరింపులు మళ్ళీ మొదలవుతాయా? అన్న ప్రశ్నకు.. “ముందు ముందు ఏం జరుగుతుందో మీరే చూస్తారు” అంటూ ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ప్రధానంగా ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి ముగింపు పలకడమే ఈ శాంతి ఒప్పందంలో అంతిమ లక్ష్యమని అమెరికా సంకేతాలిస్తోంది.
మొత్తానికి, పాకిస్థాన్ ప్రధానిని ఒక ‘దూత’గా వాడుకుంటూ ట్రంప్ సర్కార్ అంతర్జాతీయ వేదికపై ఒక పెద్ద దౌత్య యుద్ధాన్ని నడిపించిందని స్పష్టమవుతోంది.
