వైద్యం, వివాహం, చదువుల కోసం PF డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా.? ఒక్కోసారికి ఎంత మొత్తం వస్తుంది..? కొత్త నిబంధనలు తెలుసుకోండి.!

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతా నుండి నిర్దిష్ట అవసరాల కోసం పాక్షిక మొత్తాన్ని అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకునే నిబంధనలలో కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది.

వైద్య ఖర్చులు, పిల్లల ఉన్నత చదువులు, వివాహం, ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం వంటి అవసరాల కోసం పీఎఫ్ ముందస్తు నగదు (అడ్వాన్స్) ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

నూతన మార్గదర్శకాల ప్రకారం.. పీఎఫ్ అడ్వాన్స్ దరఖాస్తులను నిత్యావసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు విభాగాలుగా వర్గీకరించారు. అర్హులైన ఖాతాదారులు, ఆయా విభాగాల నిబంధనల ప్రకారం తమ మొత్తం ఈపీఎఫ్ నిల్వలో గరిష్టంగా 75% వరకు అడ్వాన్స్‌గా పొందవచ్చు. దీని కోసం ఖాతాదారుడు కనీసం 12 నెలల పాటు ఈపీఎఫ్ సభ్యుడిగా కొనసాగి ఉండాలనే నిబంధనను చేర్చారు.

వైద్య అత్యవసరాలు లేదా చికిత్స ఖర్చుల కోసం పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఎటువంటి సంఖ్యా పరిమితి (విత్‌డ్రా చేసుకునే పరిమితి) లేదని నివేదిక స్పష్టం చేస్తోంది. పిల్లల ఉన్నత చదువుల కోసం మొత్తం సర్వీస్ కాలంలో గరిష్టంగా 10 సార్లు పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. వివాహ ఖర్చుల విషయానికొస్తే.. సభ్యుడి సొంత వివాహం, పిల్లలు లేదా తోబుట్టువుల వివాహం కోసం గరిష్టంగా 5 సార్లు విత్‌డ్రా చేసుకునే వీలుంది.

ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణం, గృహ రుణ వాయిదాల చెల్లింపు లేదా ఇంటి పునరుద్ధరణ వంటి అవసరాల కోసం గరిష్టంగా 5 సార్లు పీఎఫ్ అడ్వాన్స్ పొందవచ్చు. అదే సమయంలో, నిర్దిష్ట అత్యవసర పరిస్థితుల కోసం సర్వీస్ కాలంలో 2 సార్లు మాత్రమే అడ్వాన్స్ పొందేందుకు అనుమతి ఉంటుంది. అయితే నగదు ఉపసంహరణకు దరఖాస్తు చేసే ముందు మీ వ్యక్తిగత అర్హత, ఈపీఎఫ్‌వో (EPFO) నిబంధనలు మరియు ఖాతాలోని నిల్వ మొత్తాన్ని ఒకసారి సరిచూసుకోవడం ఎంతో ముఖ్యం.


Posted

in

by

Tags: