“నన్ను కాపాడండి, ఇందులో నా ప్రియుడి శరీర భాగాలు ఉన్నాయి. నేను అతడిని చంపాను! వీటిని ఎక్కడైనా పారవేయడానికి నాకు సహాయం చేస్తే మీరు అడిగినంత డబ్బు ఇస్తాను.”
ఒక అందమైన స్త్రీ ఏమాత్రం భయం లేకుండా చెబుతున్న మాటలు విని ఆ టాక్సీ డ్రైవర్ వణికిపోయాడు. భయంతోనే సహాయం చేస్తానని ఒప్పుకుని, ఆ కారును నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసులు ఆమె వద్ద ఉన్న రెండు సూట్‌కేసులను తెరిచి చూడగా, అక్కడ ప్లాస్టిక్ కవర్లలో కుక్కిన మానవ మాంసం ముక్కలు కనిపించాయి. ఆ వాసనకు స్టేషన్ అంతా దుర్గంధం నిండిపోయింది. ఆ స్త్రీ ఎవరు? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? అసలు ఏం జరిగింది?
నేపథ్యం:
ఈ దారుణానికి ఒడిగట్టింది కేరళ కన్నూర్ జిల్లా పయ్యన్నూరుకు చెందిన డాక్టర్ ఓమన ఎడన్. 1953లో జన్మించిన ఓమన చదువులో చాలా చురుకైనది. ఆమె కంటి వైద్యురాలిగా (Ophthalmologist) స్థిరపడి, డాక్టర్ రాధాకృష్ణన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో మురళీధరన్ అనే కాంట్రాక్టర్ వారి ఇంటి పనుల కోసం రావడంతో ఆమె జీవితం తలకిందులైంది.
వివాహేతర సంబంధం – వేధింపులు:
భర్త బిజీగా ఉండటంతో ఇంటి పనులను ఓమనే పర్యవేక్షించేది. ఆ క్రమంలో మురళీధరన్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, మురళీధరన్ ఆమెను ఒక ఏటీఎంలా వాడుకోవడం మొదలుపెట్టాడు. డబ్బు కోసం, ఖరీదైన బహుమతుల కోసం ఆమెను వేధించేవాడు. అతడికి అప్పటికే భార్యాపిల్లలు ఉన్నారనే విషయం తర్వాత తెలిసిన ఓమన, అతడి నుండి విడిపోవాలని ప్రయత్నించింది. కానీ మురళీధరన్ ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.
డాక్టర్ తెలివితేటలతో పక్కా ప్లాన్:
మురళీధరన్ వేధింపుల నుండి తప్పించుకోవడానికి అతడిని చంపడమే మార్గమని ఆమె నిర్ణయించుకుంది. 1996 జూలై 11న ఊటీలోని ఒక లాడ్జిలో రూమ్ తీసుకుని అతడిని అక్కడికి పిలిపించింది. అక్కడ అతడికి మరింత ‘సుఖం’ లభిస్తుందని నమ్మించి, మత్తుమందు (విషం) ఇంజెక్షన్ ఇచ్చింది. అతడు స్పృహ కోల్పోగానే.. ఒక డాక్టరుగా తనకున్న నైపుణ్యంతో, సర్జికల్ బ్లేడ్లను ఉపయోగించి అతడి శరీరాన్ని ముక్కలుగా నరికింది. రక్తం గడ్డకట్టకుండా కొన్ని రసాయనాలను వాడింది. లోపలి అవయవాలను టాయిలెట్లో ఫ్లష్ చేసింది. మిగిలిన మాంసం ముక్కలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి రెండు సూట్‌కేసుల్లో సర్దింది.
చివరికి దొరికిపోయింది ఇలా:
ఆ సూట్‌కేసులతో ఆమె కొడైకెనాల్ చేరుకుంది. వాటిని లోయలో పారవేయాలని ప్లాన్ చేసింది. అక్కడ రాజ అనే టాక్సీ డ్రైవర్‌ను కలిసి కన్యాకుమారి వెళ్లాలని కోరింది. కారులో వస్తున్న భయంకరమైన వాసనను గమనించిన రాజ, అనుమానంతో కారును పోలీస్ స్టేషన్‌కు మళ్లించాడు. అలా 1996 జూలై 13న ఓమన పోలీసులకు చిక్కింది.
ఇప్పుడామె ఎక్కడ?
తమిళనాడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అయితే, 2001 జనవరిలో ఆమెకు బెయిల్ లభించింది. బయటకు వచ్చిన ఓమన అప్పటి నుండి అదృశ్యమైపోయింది. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినా ఆమె ఆచూకీ దొరకలేదు. 2017లో మలేషియాలో ఒక మహిళ భవనం పైనుండి పడి చనిపోతే అది ఓమన అని వార్తలు వచ్చాయి, కానీ అది నిజం కాదని తర్వాత తేలింది. 63 ఏళ్ల ఓమన నేటికీ బతికే ఉండి ఉండవచ్చు లేదా చనిపోయి ఉండవచ్చు.. కానీ ఆమె చేసిన ఆ ఘాతుకం మాత్రం కేరళ క్రైమ్ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది.
