రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శత్రువులు కానీ ఉండరు. ప్రత్యర్థులుగా భావించే వారు అధికారం కోసం చేతులు కలపడం మనం తరచుగా చూస్తుంటాం. అలాగే, ఒకప్పుడు ఒకే పార్టీలో ఉంటూ ప్రాణస్నేహితులుగా ఉన్నవారు, ఆ తర్వాత ఒకరినొకరు పట్టించుకోకపోవడం లేదా విమర్శించుకోవడం వంటి సందర్భాలూ ఉంటాయి.
స్మృతి ఇరానీకి బీజేపీలో ప్రాధాన్యత తగ్గిందా?
నటి, రాజకీయ నాయకురాలు స్మృతి ఇరానీ ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైన నాయకుల్లో ఒకరు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆమె కేంద్ర మంత్రివర్గంలో లేనప్పటికీ, పార్టీ సంస్థాగత బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సువేందు అధికారి తరపున ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, సువేందు ప్రమాణ స్వీకార వేడుకలో జరిగిన ఒక వింత సంఘటన స్మృతిని మరియు నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.
అసలేం జరిగింది?
వేడుకలో భాగంగా ప్రధాని మోదీ వేదికపై ఉన్న మిథున్ చక్రవర్తిని కలిసి కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో మిథున్ వెనుకాలే ఉన్న స్మృతి ఇరానీ, ప్రధానికి రెండుసార్లు చేతులు జోడించి నమస్కరించారు. అప్పుడు ఆమె కళ్లు చెమ్మగిల్లి ఎమోషనల్ అయినట్లు కెమెరాలో రికార్డ్ అయింది. అయితే, వైరల్ వీడియో ప్రకారం ప్రధాని మోదీ ఆమె నమస్కారాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు. ప్రధాని తనను నిర్లక్ష్యం చేయడంతో ఆమె నిరాశకు గురైనట్లు వీడియోలో కనిపిస్తోంది.
నెటిజన్ల ట్రోలింగ్
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒక నెటిజన్ “ఇక సిలిండర్ గ్యాస్ దిగిపోయింది” అని కామెంట్ చేయగా, మరొకరు “అచ్చా సిలా దియా తునే మేరే ప్యార్ కా” (నా ప్రేమకు మంచి బహుమతే ఇచ్చావు) అనే పాటను గుర్తుచేసుకున్నారు. “డిస్పోజబుల్ వస్తువును పారేసినట్లుగా ఉంది” అని ఒకరు, “నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తే ప్రధాని కాదు కదా ప్రజలు కూడా పట్టించుకోరు” అని మరొకరు ఎద్దేవా చేశారు.
బీజేపీలో స్మృతి ఇరానీ ప్రస్థానం
2003లో బీజేపీలో చేరిన స్మృతి ఇరానీ, అతి తక్కువ కాలంలోనే పార్టీలో కీలక స్థాయికి ఎదిగారు. 2010లో జాతీయ కార్యదర్శిగా, ఆ తర్వాత మహిళా మోర్చా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ ప్రభుత్వంలో మానవ వనరుల అభివృద్ధి, జౌళి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో అమేథీలో రాహుల్ గాంధీని ఓడించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అయితే, 2024 ఎన్నికల్లో అదే అమేథీలో ఓటమి పాలైనప్పటికీ, పార్టీ గొంతుకగా ఆమె కొనసాగుతున్నారు.
