దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక హృదయ విదారక ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లా, మల్లిపాసి గ్రామంలో చోటుచేసుకుంది. మరణించిన తన సోదరి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును పొందేందుకు ఒక సోదరుడు చేసిన ప్రయత్నం విఫలమవడంతో, ఏకంగా ఆమె అస్థిపంజరాన్నే తవ్వి తీసి బ్యాంకు ముందు నిరసన తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం ఈ భీతిగొల్పే దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై దేశవ్యాప్తంగా భారీ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఒక సంచిలో అస్థిపంజరాన్ని మోసుకువచ్చిన ఆ వ్యక్తిని చూసి బ్యాంకు సిబ్బంది, కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ దీనస్థితిని చూసి దేశం మొత్తం చలించిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తికి సహాయం చేయడానికి ప్రముఖ విద్యావేత్త అలఖ్ పాండే ముందుకు వచ్చారు.
అలఖ్ పాండే ₹10 లక్షల విరాళం:
‘ఫిజిక్స్ వాలా’ (Physics Wallah) వ్యవస్థాపకుడు, విద్యావేత్త అలఖ్ పాండే.. ఒడిశాలోని కియోంజర్ జిల్లాకు చెందిన గిరిజన వ్యక్తి జితు ముండాకు ₹10 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కష్టకాలంలో అతనికి అండగా నిలవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
అసలు ఏం జరిగింది?
2026 జనవరిలో మరణించిన తన సోదరి కల్రా ముండా బ్యాంకు ఖాతాలో ఉన్న సుమారు ₹19,300 డ్రా చేయడానికి జితు ముండా ప్రయత్నిస్తున్నారు. అయితే బ్యాంకు సిబ్బంది అతనికి సహకరించలేదు. ఖాతాదారుడు లేకుండా డబ్బు ఇవ్వడం సాధ్యం కాదని వారు చెప్పారు. బ్యాంకు వారు అడిగిన ‘మరణ ధృవీకరణ’ పత్రాన్ని (Death Proof), ఖాతాదారుడు స్వయంగా హాజరు కావాలని జితు ముండా తప్పుగా అర్థం చేసుకున్నారు. నిరాశకు గురైన జితు, ఏకంగా తన సోదరి అస్థిపంజరాన్నే బ్యాంకుకు తీసుకువచ్చారు.
ఈ ఘటన తర్వాత బ్యాంకు అధికారులు స్పందిస్తూ.. తమకు కేవలం చట్టపరమైన పత్రాలు మాత్రమే కావాలని స్పష్టం చేశారు. చివరకు అతనికి రావాల్సిన డబ్బును అందేలా చర్యలు తీసుకున్నారు.
డిజిటల్ యుగంలోనూ విషాదం:
భారతదేశం డిజిటల్ యుగంలో ఉంది, మెజారిటీ ఆర్థిక లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ అట్టడుగు వర్గాలకు ఈ డిజిటల్ విప్లవం పూర్తిస్థాయిలో చేరలేదని, బ్యాంకు సిబ్బంది నుండి సామాన్యులకు మరింత సహకారం అవసరమని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
