అసోం రాష్ట్రం జోర్హాట్ (Jorhat) ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యశ్ ధనుకా అగర్వాల్, తన కుటుంబ సభ్యులు ఊర్లో లేని సమయాన్ని చూసి ఇంట్లోని లాకర్‌ను పగలగొట్టి దాదాపు ₹50 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలను చోరీ చేశాడు.
ఈ ఘటనపై బాధితుడైన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ సెల్ సహాయంతో ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో ఉన్నవారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని అనుమానించిన పోలీసులకు.. నిందితుడు యశ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు పారిపోయినట్లు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా తెలిసింది. వెంటనే అతని తండ్రి స్వయంగా అక్కడికి వెళ్లి కొడుకును స్వగ్రామానికి తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు.
పోలీసులు నిందితుడు యశ్‌ను విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తన చిరకాల ప్రియురాలు భూపాలి దత్తాతో కలిసి విలాసవంతమైన జీవితం గడపడం కోసమే.. తన స్నేహితులైన జితు సోమాని, రోహిత్ ప్రసాద్‌ల సలహా మేరకు ఒక తాళాలు తీసే వ్యక్తి (కీ మేకర్) సహాయంతో ఈ చోరీకి పన్నాగం పన్నినట్లు తేలింది. చోరీ చేసిన డబ్బుతో ప్రియురాలికి ₹1.5 లక్షల విలువైన ఐఫోన్ కొనివ్వడంతో పాటు, పలు లగ్జరీ హోటళ్లలో బస చేసి ఆమె కోసం దాదాపు ₹5 లక్షల వరకు ఖర్చు చేశాడు. కుటుంబ సభ్యులు వ్యాపారం కోసం దాచుకున్న డబ్బును కాజేసిన ఈ కేసులో, యశ్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులను కూడా నిందితులుగా చేర్చారు. అయితే, ప్రియురాలిని పోలీసులు కేవలం విచారించారు తప్ప నిందితురాలిగా చేర్చలేదు.

Leave a Reply