ప్రస్తుత కాలంలో విటమిన్ బి12 లోపం అనేది ఒక సాధారణ సమస్యగా మారుతోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం దీనికి ప్రధాన కారణం. బి12 లోపం వల్ల బలహీనత, అలసట, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
మన శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారు కావడానికి విటమిన్ బి12 చాలా అవసరం. ఇవి మెదడుతో పాటు కండరాలు, ఇతర అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. బి12 లోపం ఉన్నప్పుడు చాలామంది మందులు లేదా ఇంజెక్షన్లు తీసుకుంటారు. అయితే ఎవరికి ఏది అవసరమో తెలుసుకోవడం ముఖ్యం. బి12 క్యాప్సూల్స్ లేదా టాబ్లెట్లలో 50 నుండి 5,000 మైక్రోగ్రాముల వరకు డోస్ ఉంటుంది. ఇంజెక్షన్లలో సాధారణంగా 1,000 మైక్రోగ్రాములు ఉంటుంది.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి? 2008లో జరిగిన ఒక పరిశోధన ప్రకారం.. మనం తీసుకునే 1,000 మైక్రోగ్రాముల బి12 మాత్రలలో శరీరం కేవలం 1.3% మాత్రమే గ్రహిస్తుంది. అదే ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటే, గ్రహించే రేటు 55% నుండి 97% వరకు ఉంటుంది.
బి12 ఎందుకు ముఖ్యం?
- రక్తహీనత నివారణ: దీని లోపం వల్ల మెగాలోబ్లాస్టిక్ అనీమియా రావచ్చు. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- నాడీ వ్యవస్థ: మెదడు మరియు నాడీ వ్యవస్థ పనితీరుకు ఇది కీలకం. దీని లోపం వల్ల చేతులు, కాళ్లు తిమ్మిర్లు రావడం, జ్ఞాపకశక్తి తగ్గడం, నిరాశ (Depression) వంటివి కలుగుతాయి.
- శక్తి ఉత్పత్తి: ఆహారంలోని పోషకాలను శక్తిగా మార్చడంలో ఇది సహాయపడుతుంది.
మాత్రలు vs ఇంజెక్షన్లు: విటమిన్ బి12 ఇంజెక్షన్లు నేరుగా కండరాలకు ఇస్తారు కాబట్టి శరీరం వీటిని బాగా గ్రహిస్తుంది. మాత్రలు జీర్ణవ్యవస్థ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. అందుకే మాత్రలను ప్రతిరోజూ 3 నుండి 6 నెలల పాటు వాడాల్సి ఉంటుంది. ఇంజెక్షన్ల ద్వారా బి12 స్థాయిలు త్వరగా పెరుగుతాయి.
వైద్యుల సలహా:
- మీ బి12 స్థాయి 150 pg/ml కంటే తక్కువగా ఉంటే, ఇంజెక్షన్లు తీసుకోవడం మంచిది.
- స్థాయి 200 – 300 pg/ml మధ్య ఉంటే, వైద్యుల సలహాతో మాత్రలు ప్రారంభించవచ్చు.
