బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ మోడల్ సదర్ ఆసుపత్రిలో భద్రతా లోపాన్ని ఎత్తిచూపే ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
మహారాజ్‌గంజ్ ప్రాంతానికి చెందిన ఆరతీ దేవి (35) అనే మహిళ పాముకాటుతో మృతి చెందగా, పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ఒక స్ట్రెచర్‌పై ఉంచారు. ఆ సమయంలో మాస్క్ ధరించిన ఒక గుర్తుతెలియని వ్యక్తి, చుట్టుపక్కల ఎవరూ లేనిది చూసి ఆ స్ట్రెచర్‌ను కాస్త పక్కకు నెట్టి, మృతురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును తెంపి జేబులో పెట్టుకుని చాలా కూల్‌గా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
కేవలం 9 సెకన్లలో ముగిసిన ఈ దొంగతనాన్ని అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారి తీవ్ర దుమారం రేపుతోంది. ఆసుపత్రి ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, అక్కడి సిబ్బంది గానీ, అధికారులు గానీ ఈ దొంగతనాన్ని గమనించకపోవడం గమనార్హం. ఈ వీడియో నెట్టింట వైరల్ అయి, ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమైన తర్వాతే ఆసుపత్రి యాజమాన్యం మేల్కొని వివరణ ఇవ్వడం ప్రారంభించింది.
గతంలో కూడా ఇదే ఆసుపత్రిలో మరణించిన ఒకరి కాలికి ఉన్న వెండి పట్టీలను దొంగిలించారని బంధువులు ఫిర్యాదు చేసినా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. తాజా ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఈ అమానవీయ ఘటనను ఎత్తిచూపుతూ బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి నిశాంత్ కుమార్, ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష ఆర్జేడీ (RJD) తీవ్ర స్థాయిలో మండిపడింది.

Leave a Reply