అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైపు నుండి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తన ఉపాధ్యక్షుడు జెడి వెన్స్ మరియు అల్లుడు జారెడ్ కుష్నర్లతో కూడిన బృందానికి పాకిస్థాన్ వెళ్లేందుకు టికెట్లు కూడా ఖరారు చేశారు. ఇస్లామాబాద్ నగరం ఒక సైనిక స్థావరంగా మారిపోయింది. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని ప్రపంచమంతా భావించింది. కానీ, కొద్ది గంటల వ్యవధిలోనే ఇరాన్ షాక్ ఇచ్చింది. పాకిస్థాన్‌లో జరిగే ఎటువంటి శాంతి చర్చల్లోనూ తాము పాల్గొనబోమని ఇరాన్ తెగేసి చెప్పింది.
ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘ఇర్నా’ (IRNA) నివేదిక ప్రకారం, అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలు పూర్తిగా పట్టాలు తప్పాయి. వాషింగ్టన్ పెడుతున్న వింత డిమాండ్లు, ఏకపక్ష షరతుల మధ్య ఎటువంటి చర్చలు సాధ్యం కాదని ఇరాన్ స్పష్టం చేసింది. చర్చల మేజాపై అమెరికా తన వైఖరిని పదే పదే మార్చుకోవడం, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఒకవైపు మెడపై కత్తి.. మరోవైపు శాంతి కబుర్లా? ఈ గొడవకు ప్రధాన కేంద్రం ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’. ఇక్కడ ప్రస్తుతం అమెరికా, ఇరాన్ నౌకాదళాలు ముఖాముఖి తలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ (Ceasefire) చర్చలు జరుగుతున్నప్పుడు, హోర్ముజ్ మరియు ఇరాన్ ఓడరేవులపై అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని (Naval Blockade) ఎందుకు తొలగించలేదని ఇరాన్ ప్రశ్నిస్తోంది. దీనిని కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా ఇరాన్ భావిస్తోంది. “ఒకవైపు మా మెడపై కత్తి పెట్టి, మరోవైపు టేబుల్ వద్ద కూర్చుని శాంతి గురించి మాట్లాడమంటే ఎలా?” అని ఇరాన్ వాదిస్తోంది.
బెదిరింపుల మధ్య చర్చలు అసాధ్యం డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే రెచ్చగొట్టే ప్రకటనలు మంటల్లో నెయ్యి పోసినట్లుగా మారాయి. ట్రంప్ బెదిరింపులను ఇరాన్ ఏమాత్రం సహించలేకపోతోంది. ఇటువంటి బెదిరింపుల వాతావరణంలో చర్చలు ఎలా సాధ్యమని ఇరాన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి అర్థవంతమైన చర్చలకు తావులేదని ‘ఇర్నా’ స్పష్టం చేసింది.
డ్యామేజ్ కంట్రోల్లో పాకిస్థాన్ తన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు కావడంతో పాకిస్థాన్ ఇప్పుడు రంగంలోకి దిగింది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ హుటాహుటిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి ఫోన్ చేశారు. చర్చల తలుపులు పూర్తిగా మూసివేయవద్దని కోరారు. ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వం వహించి పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోందని ఇరాన్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి, ప్రపంచ దేశాల ముందు తన పరువు పోకుండా పాకిస్థాన్ ఈ దౌత్యపరమైన సంబంధాలను కాపాడుకోవాలని తాపత్రయపడుతోంది.
