మధ్యప్రదేశ్: గ్వాలియర్‌లో వివాహం జరిగిన మరుసటి రోజే నవవధువు తన ప్రియుడితో కలిసి పరారైన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఏం జరిగింది? గ్వాలియర్‌కు చెందిన జితేంద్ర జోషితో, మురైనాకు చెందిన నమ్రత జోషి వివాహం జూన్ 28న ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత నవవధువు తన అత్తగారింటికి చేరుకుంది. ఆ రాత్రి అంతా ఇంట్లో అంతా సంతోషకరమైన వాతావరణమే నెలకొంది. అయితే, మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వరుడు, తన భార్య నమ్రత ఇంట్లో లేకపోవడాన్ని గమనించి షాక్‌కు గురయ్యాడు. గదులన్నీ లోపలి నుంచే తాళం వేసి ఉండటంతో, ఆమె ఎలా బయటకు వెళ్లిందో అర్థం కాక వరుడి కుటుంబ సభ్యులు అయోమయానికి లోనయ్యారు.
సీసీటీవీలో అసలు నిజం.. ఇంట్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, నమ్రత ఇంటి పైకప్పు (రూఫ్) మీదుగా దూకి, బయట వేచి ఉన్న తన ప్రియుడితో కలిసి పరారైనట్లు తేలింది. అంతేకాకుండా, ఇంట్లో ఉన్న బంగారు, వెండి నగలు కూడా మాయమయ్యాయి. ఈ ఘటనపై వరుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చివరికి ఏం జరిగింది? విషయం తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు, నమ్రతను వెతికి పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ నమ్రత తన తప్పును అంగీకరించింది. తన భర్తతోనే కలిసి జీవించడానికి సిద్ధమని ఆమె చెబుతున్నప్పటికీ, పెళ్లయిన మరునాడే జరిగిన ఈ దారుణ ఘటనతో వరుడు తీవ్ర భయాందోళనకు మరియు మానసిక వేదనకు గురయ్యాడు.
