ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఒక మసీదులో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్న ఘటనలో మరణించిన వారి సంఖ్య 69కి చేరుకుంది. ఈ దాడిలో మరో 169 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇస్లామాబాద్‌లోని షెహజాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న తర్లాయ్ ఇమాంబర్గా (షియా ప్రార్థనా స్థలం) వద్ద ఈ పేలుడు సంభవించింది. షియా విశ్వాసులు పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఈ ప్రార్థనా మందిరంలోకి చొరబడేందుకు ఉగ్రవాది ప్రయత్నించాడు. అయితే, ప్రధాన ద్వారం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకోవడంతో, ఉగ్రవాది అక్కడికక్కడే తనను తాను పేల్చుకున్నాడు.
ఈ పేలుడు ధాటికి మసీదు ప్రాంగణం రక్తసిక్తమైంది. ఘటన జరిగిన వెంటనే ఇస్లామాబాద్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నగరంవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని (Emergency) ప్రకటించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) మరియు పాలీక్లినిక్ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
