హైదరాబాద్: భాగ్యనగరంలోని ఒక ప్రముఖ ఫర్నిచర్ షోరూమ్‌లోకి వచ్చిన కస్టమర్లు.. అక్కడ ప్రదర్శనకు ఉంచిన సోఫాలు, బెడ్‌లపై తమ సొంత ఇంట్లో ఉన్నట్లే పడుకుని, కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఒక వీడియో ప్రస్తుతం ‘X’ (ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యక్షమైంది. ఈ వీడియో నెటిజన్ల మధ్య రెండు భిన్నమైన అభిప్రాయాలకు దారితీసి, ఒక పెద్ద చర్చాంశనీయంగా మారింది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. పసుపు రంగు చొక్కా ధరించిన ఒక వ్యక్తి Sofa-cum-bed పై హాయిగా పడుకుని ఉండగా, అతని పక్కన ఒక చిన్నారి ఆడుకుంటోంది. అలాగే, కొంచెం దూరంలో ఇద్దరు వృద్ధ మహిళలు ఒక చిన్న బాబును ఒడిలో పెట్టుకుని సోఫాపై ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
తీవ్రంగా విమర్శించిన నెటిజన్:
ఈ వీడియోను షేర్ చేసిన ఒక నెటిజన్.. మన దేశ ప్రజల ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టాడు. “ప్రజలకు కనీస విచక్షణ (కామన్ సెన్స్) లేకపోవడాన్ని పక్కనబెడితే, మనవాళ్లు ఎంత అన్‌ఫిట్‌గా ఉన్నారో ఇది చూపిస్తోంది. సరైన వ్యాయామం లేకుండా, చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్లే భారతీయులు ఇలా ఎక్కడ పడితే అక్కడ నీరసపడిపోతూ తిరుగుతున్నారు” అంటూ అత్యంత ఘాటుగా విమర్శించాడు.
తిప్పికొట్టిన మెజారిటీ నెటిజన్లు – కౌంటర్ల వర్షం:
అయితే, ఈ విమర్శనాత్మక పోస్ట్‌పై మెజారిటీ నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సదరు వ్యక్తికి గట్టిగా బుద్ధి చెబుతున్నారు. “ప్రపంచవ్యాప్తంగా ఏ ఫర్నిచర్ దుకాణానికి వెళ్లినా.. సోఫాలు, బెడ్‌లను ఇలా కూర్చుని, పడుకుని కంఫర్ట్‌గా ఉన్నాయో లేదో చూసే కొనుగోలు చేస్తారు. ఇందులో ఎలాంటి తప్పు లేదు. కేవలం వ్యూస్ కోసం, 5 పైసల పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలో తోటి మనుషులను ఇలా కించపరచడం ఆపండి” అంటూ నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు.
రెండు వర్గాలుగా విడిపోయిన ఇంటర్నెట్:
మరికొందరు ఈ విషయమై స్పందిస్తూ.. “ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్ లేదా షోరూమ్‌లలో వృద్ధులు, పిల్లలు కూర్చోవడానికి యాజమాన్యం విడిగా ఎలాంటి కుర్చీలు వేయడం లేదు, అందుకే వారు అక్కడ కూర్చున్నారు” అని సమర్థిస్తున్నారు. అదే సమయంలో, “కొందరు కస్టమర్లు కనీస పరిశుభ్రత పాటించకుండా ఆ సోఫాలపై కూర్చుని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నారు” అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా, ఈ హైదరాబాద్ షోరూమ్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది.
