క్రికెట్ ప్రపంచంలో ఓ శకంగా మారిన సచిన్ టెండూల్కర్ ప్రారంభ కెరీర్ మ్యాచ్‌లు కాశ్మీరీ విల్లో (Kashmir Willow)తో తయారు చేసిన బ్యాట్‌తోనే మొదలయ్యాయి.
తన సోదరి ఎంతో ప్రేమతో బహుమతిగా ఇచ్చిన ఆ మొదటి బ్యాట్‌తోనే అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ సెంచరీల మీద సెంచరీలు బాదుతూ ఎన్నో రికార్డులను తిరగరాశారు. అయితే సచిన్ వంటి ఎందరో మేటి క్రికెటర్లను అందించిన చారిత్రక కాశ్మీర్ బ్యాట్ల పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
కాశ్మీర్లో పెరిగే ‘సాలిక్స్ ఆల్బా’ (Salix alba) అనే ప్రత్యేకమైన విల్లో చెట్ల నుంచే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ బ్యాట్లను తయారు చేస్తారు. ఆస్ట్రేలియా సహా ప్రపంచవ్యాప్తంగా ఎందరో అగ్రశ్రేణి క్రికెటర్లు కూడా ఈ బ్యాట్లను ఉపయోగించి ఆడారు. కానీ, ఇటీవల బ్యాట్ల తయారీ సంస్థల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఈ చెట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.
విపరీతమైన డిమాండ్ కారణంగా కనీసం పూర్తిస్థాయిలో ఎదగని చిన్న, లేత చెట్లను కూడా నరికేస్తున్నారు. అంతేకాకుండా, నరికిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలను నాటి పెంచడంలో ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల దాదాపు 50 శాతం వరకు ముడిసరుకు కొరత ఏర్పడి, బ్యాట్ తయారీ సంస్థలు వ్యాపారం సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
క్రికెట్ మార్కెట్లో అధిక ధర పలికే ఇంగ్లీష్ విల్లో బ్యాట్లకు ప్రత్యామ్నాయంగా, సరసమైన ధరలకే అత్యుత్తమ నాణ్యమైన బ్యాట్లను అందించిన ఘనత ఈ కాశ్మీరీ విల్లో పరిశ్రమదే. అయితే, ఈ అరుదైన చెట్లను ప్లైవుడ్ వంటి ఇతర అవసరాల కోసం అక్రమంగా నరికి తరలించడం ఈ పరిశ్రమను మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తోంది.
సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ ప్రయాణ జ్ఞాపకార్థం ఇటీవల స్వయంగా కాశ్మీర్‌లోని బ్యాట్ల తయారీ కర్మాగారాన్ని సందర్శించి పరిశీలించారు. సచిన్ రికార్డుల ప్రస్థానానికి పునాది వేసిన కాశ్మీర్ సాంప్రదాయ విల్లో బ్యాట్ల పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం, అధికారులు తక్షణమే రక్షణ చర్యలు తీసుకోకపోతే.. ఈ చారిత్రక పరిశ్రమ శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

Leave a Reply