తెలంగాణలోని హైదరాబాద్ బాలానగర్ ప్రాంతంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
షాపుర్‌కు చెందిన ప్రకాష్ పవార్ (56) అనే వ్యాపారి, అమీర్‌పేటలోని తన బంగారం కరిగించే దుకాణానికి స్కూటర్‌పై వెళ్తుండగా బాలానగర్ ఫ్లైఓవర్ కింద ఈ ప్రమాదం జరిగింది. పరిమితికి మించి భారీగా ఇనుప పైపుల లోడుతో వెళ్తున్న ఒక గూడ్స్ వాహనం అక్కడి మలుపు వద్ద యూ-టర్న్ (U-turn) తీసుకునే క్రమంలో.. అధిక భారం కారణంగా ఒక్కసారిగా బోల్తా పడింది.
సరిగ్గా అదే సమయానికి ఆ వాహనానికి ఎడమ వైపున స్కూటర్‌పై వెళ్తున్న ప్రకాష్ పవార్ మీద ఆ భారీ ఇనుప పైపులన్నీ కుప్పకూలాయి. ఆ పైపుల బరువుకు స్కూటర్‌తో సహా ఆయన అక్కడికక్కడే నలిగిపోయి దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న బాలానగర్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. క్రేన్ సహాయంతో ఆ ఇనుప పైపులను తొలగించి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ హృదయ విదారక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి ఓవర్‌లోడ్ వేసినందుకు గాను.. వాహన డ్రైవర్, యజమానితో పాటు ఆ లోడు పంపిన వ్యక్తిపై (మొత్తం ముగ్గురిపై) భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 కింద కేసు నమోదు చేశారు. డ్రైవర్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు అదనపు డీసీపీ ఎం. సుదర్శన్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఓవర్‌లోడ్‌తో నడిపే వాహనాల వల్ల అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తుండటంపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Leave a Reply