ఇన్స్టాగ్రామ్ స్నేహితురాలి తండ్రి ప్రాణాపాయంలో ఉన్నాడని సహాయం చేయబోతే.. చివరకు లక్షలాది రూపాయలు పోగొట్టుకుని నడిరోడ్డున పడ్డారు కొందరు యువతులు. సింగపూర్లో భారీ జీతంతో ఉద్యోగాలంటూ ఆశ చూపి, పట్టభద్రులైన యువతులనే వల వేసి వేటాడిన ఓ కిలాడీ లేడీ ఉదంతం ఇప్పుడు చెన్నై పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది.
అసలేం జరిగింది?
చెన్నైలోని కొలత్తూరుకు చెందిన 24 ఏళ్ల సుస్మిత అనే యువతి సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సుస్మితకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఐశ్వర్య అనే యువతి పరిచయమైంది. కొన్నాళ్ల తర్వాత తన తండ్రికి అత్యవసర ఆపరేషన్ చేయాలని, డబ్బులు కావాలని ఐశ్వర్య కోరడంతో సుస్మిత మరియు ఆమె స్నేహితులు తరచూ డబ్బులు పంపేవారు.
సింగపూర్ ఉద్యోగం పేరుతో వల..
నమ్మకం కుదిరిన తర్వాత, ఐశ్వర్య తన అసలు రంగు బయటపెట్టింది. తాను ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నానని, సింగపూర్లో నెలకు 4,000 డాలర్ల (సుమారు రూ. 3.5 లక్షలు) జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికింది.
సుస్మిత అప్పటికే చెన్నైలోని ఒక ప్రముఖ సంస్థలో మంచి జీతంతో పని చేస్తున్నప్పటికీ, ఐశ్వర్య పదే పదే ఒత్తిడి చేయడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసింది.
సుస్మితతో పాటు ఆమె స్నేహితులు రేఖ, దుర్గా కూడా సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
రూ. 24 లక్షల టోకరా!
వీసా ఖర్చులు, ప్రాసెసింగ్ ఫీజులంటూ ఐశ్వర్య వీరి నుండి విడతల వారీగా మొత్తం రూ. 24 లక్షలు వసూలు చేసింది. తీరా డబ్బులు చేతికి అందాక వారికి నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ముఖం చాటేసింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
లేడీస్ హాస్టల్లో అరెస్ట్..
సుస్మిత ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తారామణి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ఐశ్వర్య (28)ను చెన్నై కోడంబాక్కంలోని ఒక లేడీస్ హాస్టల్లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితురాలు ఐశ్వర్య కరూర్ జిల్లాకు చెందిన ఎం.ఎస్సీ పట్టభద్రురాలు.
ఈమె ఇంకా ఎంతమందిని ఇలా ఉద్యోగాల పేరుతో మోసం చేసిందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
చదువుకున్న యువతులే ఇలాంటి సోషల్ మీడియా మోసాలకు గురవ్వడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
