“సిగ్గుపడండి.. కాస్త నాగరికత నేర్చుకోండి!” వేదికపైనే చైనాకు గట్టిగా బదులిచ్చిన ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి.. రెండు దేశాల మధ్య అసలేం జరుగుతోంది..?

దక్షిణ చైనా సముద్ర వివాదంపై చైనా, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సాగుతున్న ఘర్షణ వాతావరణం ఇప్పుడు దౌత్యపరంగా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.

దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో మాట్లాడిన ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బర్టో తియోడోరో, దక్షిణ చైనా సముద్రంపై 2016 నాటి అంతర్జాతీయ న్యాయస్థాన తీర్పును చైనా తిరస్కరించడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో చైనా ప్రతినిధుల నుంచి ఆయనకు ఒక లిఖితపూర్వక లేఖ అందినట్లు తియోడోరో వెల్లడించారు.

ఆ లేఖలో 2016 నాటి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును చైనా “స్వీకరించదు, గుర్తించదు” అనే పాత వైఖరినే మళ్లీ ప్రస్తావించారని ఫిలిప్పీన్స్ మంత్రి తెలిపారు. దీనిపై వేదికపైనే ఘాటుగా స్పందించిన ఆయన, అంతర్జాతీయ తీర్పును చైనా ధిక్కరించడాన్ని దుయ్యబట్టడమే కాకుండా.. ఆ లేఖ సదస్సుకు, అంతర్జాతీయ చట్టాలకు జరిగిన తీవ్ర అవమానమని మండిపడ్డారు. “సిగ్గుపడండి.. కనీస మర్యాద, నాగరికత నేర్చుకోండి” అంటూ బహిరంగంగానే చైనా తీరును కడిగిపారేశారు.

ఈ వివాదానికి ప్రధాన మూలం దక్షిణ చైనా సముద్రంపై హక్కుల పోరాటమే. 2016లో హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం.. దక్షిణ చైనా సముద్రంపై చైనా చేస్తున్న చారిత్రక హక్కుల వాదనకు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని తేల్చిచెప్పింది. ఫిలిప్పీన్స్ ఈ అంతర్జాతీయ తీర్పుకు కట్టుబడి ఉండగా, చైనా మాత్రం ఆ తీర్పును తోసిపుచ్చి దక్షిణ చైనా సముద్రం తమదేనని పట్టుబడుతోంది.

దీంతో సముద్ర జలాల్లో ఇరు దేశాల నౌకలు పరస్పరం ఢీకొనే స్థాయికి చేరడమే కాకుండా, దౌత్యపరమైన ఉద్రిక్తతలు కూడా పతాక స్థాయికి చేరాయి. ఈ ఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఫిలిప్పీన్స్ ఉద్దేశపూర్వకంగా వివాదాన్ని రెచ్చగొడుతోందని, ద్వైపాక్షిక సంబంధాలకు, దక్షిణ చైనా సముద్ర శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని పేర్కొంది. ప్రపంచ దేశాలు పాల్గొన్న ఒక భద్రతా సదస్సులోనే ఇరుపక్షాలు ఇంతటి తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణ తీవ్రతను స్పష్టం చేస్తోంది.


Posted

in

by

Tags: