తమిళ చిత్రసీమ అగ్రనటుడు, లోకనాయకుడు కమల్ హాసన్ సినీ పరిశ్రమలో తన 67 ఏళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
‘కళత్తూర్ కన్నమ్మ’ చిత్రంలో బాలనటుడిగా పరిచయమైన ఆయనకు సినీ ప్రముఖులు, లక్షలాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టిన కమల్ హాసన్… “నా 67 ఏళ్ల సినిమా ప్రయాణంలో కేవలం 20 ఏళ్లను మాత్రమే నేను నిజమైన అభ్యసన కాలంగా భావిస్తాను. మిగిలిన కాలమంతా మురుగునీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లే గడిచింది” అంటూ ఎంతో భావోద్వేగంగా పేర్కొన్నారు.
అంతేకాకుండా, సినిమా రంగం ఆవిర్భవించి దాదాపు 130 ఏళ్లు పూర్తవగా, ఆ చరిత్రలో సగానికి పైగా కాలం పాటు తను పరిశ్రమలోనే కొనసాగుతుండటం తలచుకుంటేనే ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. అలాగే, “సినిమా రంగంలోని ‘జెన్-జీ’ (Gen Z) తరంలో నేనే అత్యంత పెద్దవాడిని (సీనియర్‌ని)” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, కమల్ హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తన 173వ చిత్రమైన ‘ధర్మన్’లో నటిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తర్వాత, దాదాపు 47 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం రజినీ – కమల్ కలిసి ఓ సరికొత్త చిత్రంలో నటించనున్నారు.
రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఇంబన్ ఉదయనిధి నిర్మించనున్న ఈ భారీ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. భారత సినీ చరిత్రలోనే ఎంతో కాలం తర్వాత సూపర్ స్టార్ రజినీ, లోకనాయకుడు కమల్ కలిసి ఒకే తెరపై కనిపించనుండటం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

Leave a Reply