నోయిడా: ప్రముఖ ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ (HCL) టెక్నాలజీస్ 50 ఏళ్ల వేడుకల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. సంస్థ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, చైర్పర్సన్ రోష్ని నాడార్ సమక్షంలో అట్టహాసంగా జరుగుతున్న ఈ వేడుకల్లో.. ఒక ఉద్యోగి నేరుగా సీఈఓనే నిలదీయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగింది?
హెచ్సీఎల్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నోయిడా క్యాంపస్లో భారీ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ తన పాటలతో హోరెత్తించారు. ఆ జోష్లో సంస్థ సీఈఓ విజయ్ కుమార్ సి వేదికపైకి వచ్చి ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేయడం మొదలుపెట్టారు. అంతా కేరింతలు కొడుతుంటే, సడన్గా గుంపులో నుంచి ఒక ఉద్యోగి గొంతు వినిపించింది. “సర్.. అప్రైజల్ కబ్ హోగా?” (సర్, జీతాల పెంపు ఎప్పుడు ఉంటుంది?) అంటూ గట్టిగా అరిచాడు.
వైరల్ అవుతున్న వీడియో
హెచ్సీఎల్ ఉద్యోగి ప్రజ్వల్ భాటియా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, అది కాస్తా వైరల్ అయ్యింది. సీఈఓ స్టేజ్ మీద చేతులు ఊపుతూ డాన్స్ చేస్తుంటే, కింద నుంచి ఉద్యోగి అడిగిన ఈ ప్రశ్న అక్కడున్న వారందరినీ నవ్వించింది. బహుశా మ్యూజిక్ హోరులో సీఈఓకు ఆ మాట వినిపించి ఉండకపోవచ్చు కానీ, పక్కనే ఉన్న ఉద్యోగులు మాత్రం ఆ మాట వినగానే పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు.
నెటిజన్ల చురకలు
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు:
- “ఆయన రెండు చేతులు ఊపుతూ డాన్స్ చేయట్లేదు.. ఎప్పటికీ అప్రైజల్ ఉండదు అని సిగ్నల్ ఇస్తున్నారు” అని ఒకరు జోక్ చేశారు.
- “ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ డబ్బులతోనే ఈ భారీ ఈవెంట్ చేస్తున్నట్టున్నారు” అని మరొకరు విమర్శించారు.
- “ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డాన్సే మీకు ఇచ్చే అప్రైజల్.. ఎంజాయ్ చేయండి!” అంటూ మరికొందరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
50 ఏళ్ల ప్రస్థానం
1976లో శివ్ నాడార్ నేతృత్వంలో కేవలం ఎనిమిది మంది ఇంజనీర్లతో మొదలైన హెచ్సీఎల్, నేడు ప్రపంచ స్థాయి ఐటీ సంస్థగా ఎదిగింది. ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా వచ్చే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 9 నగరాల్లో 9 కన్సర్ట్లు నిర్వహిస్తామని రోష్ని నాడార్ ప్రకటించారు. అంతేకాదు, ఈ ప్రోగ్రాం అయిపోయేసరికి అర్ధరాత్రి కావడంతో, ఉద్యోగుల సౌకర్యార్థం ఢిల్లీ మెట్రో సమయాన్ని రాత్రి 12:30 వరకు పొడిగించేలా డిఎంఆర్సితో ఒప్పందం కూడా చేసుకున్నారు.
