సీఎం విజయ్ తొలి బహిరంగ సభ: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది వారాలకే, విజయ్ సోమవారం తిరుచ్చిరాపల్లిలో తన తొలి బహిరంగ సభను నిర్వహించారు. తమ పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ (TVK)ను గెలిపించినందుకు, దశాబ్దాలుగా ఉన్న డీఎంకే-ఏఐఏడీఎంకే ఆధిపత్యాన్ని అంతం చేసినందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తన ప్రసంగంలో రాజకీయ ప్రత్యర్థులపై విజయ్ విమర్శలు గుప్పించారు. “నేను ఆరు నెలల పాటు నిశ్శబ్దంగా ఉంటానని చెప్పిన వారు, కనీసం ఆరు రోజులు కూడా మౌనంగా ఉండలేకపోయారు” అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, తన గెలుపు రాష్ట్ర సాంప్రదాయ రాజకీయాలను తిరస్కరించడమేనని ఆయన అభివర్ణించారు.
సినిమా స్టైల్లో కృతజ్ఞతలు: “నేను బాధ్యతలు చేపట్టి కొన్ని వారాలే అయ్యింది. కానీ, నన్ను ఆరు నెలలు మౌనంగా ఉండమని చెప్పిన వారు ఆరు రోజులు కూడా ఆగలేకపోయారు. ఇన్నాళ్లు మిమ్మల్ని మభ్యపెడుతూ వస్తున్న ఆ రెండు శక్తులను (DMK-AIADMK) మీరు తిరస్కరించారు. మీ విజయ్‌ని, మీ అన్నను, మీ తమ్ముడిని మీరు ఎంచుకున్నారు. నేను ముఖ్యమంత్రిని కాదు, మీ మొదటి సేవకుడిని” అని విజయ్ వ్యాఖ్యానించారు.
తిరుచ్చిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు ఆయన ప్రత్యేక భరోసా ఇచ్చారు. ఆ నియోజకవర్గం నుండి గెలిచినప్పటికీ, తర్వాత రాజీనామా చేసి పెరంబూర్ నియోజకవర్గాన్ని తన వద్ద ఉంచుకున్నారు. తనకు తిరుచ్చిరాపల్లితో వ్యక్తిగత అనుబంధం ఉందని ఆయన తెలిపారు. “ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నేను పెరంబూర్ ఎమ్మెల్యేని కావచ్చు, కానీ తిరుచ్చిరాపల్లి ప్రజలు నా గుండెకు చాలా దగ్గర” అని ఆయన పేర్కొన్నారు.
తిరుచ్చిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీ మైదానంలో జరిగిన ఈ భారీ సభకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. తిరుచ్చిరాపల్లి ఈస్ట్ ప్రజలు తనకు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలపడం ఈ సభ ప్రధాన ఉద్దేశం.
రాజీనామా వెనుక కారణం: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తన తిరుచ్చిరాపల్లి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. అధికారికంగా ఆయన చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతారని ప్రకటించారు. ఆ సీటుకు రాజీనామా చేసినప్పటికీ, టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కావడానికి సహకరించిన ఆ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలపడం కోసం ఆయన ఈ ప్రత్యేక సభను ఏర్పాటు చేశారు.
