సీలింగ్ ఫ్యాన్లను శుభ్రం చేయడం అనేది చాలామందికి నచ్చని ఇంటి పనుల్లో ఒకటి. ముఖ్యంగా చాలా రోజులుగా శుభ్రం చేయని ఫ్యాన్ రెక్కలపై దుమ్ము, ధూళి, జిడ్డుతో కూడిన మురికి పేరుకుపోతుంది.
వాటిని సాధారణ గుడ్డతో తుడిచినప్పుడు దుమ్ము కింద పడి నేల, మంచం లేదా మన ముఖం మీదే పడుతుంది. దీనివల్ల ఫ్యాన్ శుభ్రం చేసిన దానికంటే మళ్లీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ఈ సమస్యకు సులువైన పరిష్కారంగా ఒక పాత కాటన్ దిండు కవర్‌ను (Pillowcase) ఉపయోగించవచ్చు. మొదట ఫ్యాన్ స్విచ్‌ను పూర్తిగా ఆఫ్ చేసి, భద్రత కోసం నిచ్చెన లేదా దృఢమైన స్టూల్‌పై ఎక్కి ఫ్యాన్ రెక్కకు దిండు కవర్‌ను పూర్తిగా తొడగాలి. ఆ తర్వాత కవర్ పైభాగం నుంచి బ్లేడ్‌ను తేలికగా నొక్కి పడుతూ నెమ్మదిగా వెనక్కి లాగాలి. దీనివల్ల బ్లేడ్‌పై ఉన్న ఎండిన దుమ్ము మొత్తం నేరుగా దిండు కవర్లోనే పడుతుంది; కింద నేలపై రాలడం తగ్గుతుంది.
ఫ్యాన్ రెక్కలపై దుమ్ముతో పాటు నూనె జిడ్డు లేదా తేమ వల్ల ఏర్పడిన మొండి మురికి ఉంటే.. ఒక కప్పు నీరు, 2 చెంచాల వైట్ వెనిగర్, అర చెంచా డిష్ వాష్ లిక్విడ్ కలిపి ఒక క్లీనింగ్ లిక్విడ్‌ను తయారు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దీనిని బ్లేడ్‌పై కొద్దిగా రాసి గుడ్డతో తుడిచిన తర్వాత, తేమ ఏమీ లేకుండా పొడి గుడ్డతో మళ్లీ తుడవాలి.
శుభ్రం చేసేటప్పుడు ముఖ్యంగా విద్యుత్ సరఫరాను ఆపివేయడం తప్పనిసరి. దుమ్ము కళ్లలో పడకుండా రక్షణ కళ్లద్దాలు, ముఖానికి మాస్క్ ధరించడం మంచిది. అంతేకాకుండా నిచ్చెన లేదా స్టూల్ ఎక్కి పని చేస్తున్నప్పుడు కాలు జారకుండా అప్రమత్తంగా ఉండాలి. ఇలా ముందుగా దుమ్మును దిండు కవర్లోకి సేకరించి, ఆపై అవసరమైన చోట తడి గుడ్డతో తుడిస్తే ఫ్యాన్ శుభ్రం చేయడం చాలా సులువైపోతుంది.
