తమిళనాడులో తీవ్ర కలకలం రేపిన సూట్‌కేస్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని మణిపూర్ రాష్ట్రంలో పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
గత నెలాఖరులో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ బోగీలో ఉంచిన ఎరుపు రంగు సూట్‌కేస్ నుంచి దుర్వాసన రావడంతో ఆగ్రా రైల్వే స్టేషన్లో పోలీసులు దానిని తనిఖీ చేశారు. ఆ సమయంలో తల, ఇతర శరీర భాగాలు నరికివేయబడిన స్థితిలో ఉన్న ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతురాలిని ఒడిశాకు చెందిన హిదాయత్ నిషా (38)గా నిర్ధారించారు.
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, ఆ సూట్‌కేస్‌ను ఒక స్త్రీ, పురుషుడు మోసుకెళ్లినట్లు గుర్తించారు. ఆ ఆధారాలతో గూడువాంచేరి మసీదు వీధిలోని ఒక అద్దె ఇంట్లో ముమ్మర సోదాలు నిర్వహించగా, అక్కడ ఒక పెద్ద వంట పాత్రలో దాచి ఉంచిన మరికొన్ని శరీర భాగాలు లభ్యమయ్యాయి.
ఈ కిరాతక హత్యలో మాణిక్ ఉద్దీన్ లస్కర్, అతని భార్య భాగమతి మజిక్ ప్రధాన నిందితులుగా తేలడంతో వారిద్దరూ అక్కడి నుంచి పరారై తలదాచుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఏర్పాటైన ప్రత్యేక పోలీసు బృందం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టి, చివరకు ప్రధాన నిందితుడైన 22 ఏళ్ల మాణిక్ ఉద్దీన్ లస్కర్‌ను మణిపూర్ రాష్ట్రం జిరిబామ్ జిల్లా కాశీంపూర్ ప్రాంతంలో అరెస్ట్ చేసింది.

Leave a Reply