సోదరి అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంకుకు.. ₹19,300 కోసం ఓ పేదవాడి ఆవేదన! ఒడిశాలో కలకలం రేపిన ఘటన

ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో ఓ వ్యక్తి తన సోదరి బ్యాంక్ ఖాతాలో ఉన్న ₹19,300 నగదును విత్ డ్రా చేయడం కోసం, మండుతున్న ఎండలో ఆమె అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని మూడు కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు వెళ్లాడు.

అసలేం జరిగిందంటే? కియోంజర్ జిల్లా దియానాలి గ్రామానికి చెందిన జీతూ ముండా సోదరి కాక్రా ముండాకు ‘ఒడిశా గ్రామీణ బ్యాంక్’లో ఖాతా ఉంది. కాక్రా రెండు నెలల క్రితం మరణించింది. అంతకుముందే ఆమె భర్త, ఏకైక సంతానం కూడా చనిపోవడంతో, జీతూ ఒక్కడే ఆమెకు మిగిలి ఉన్న ఏకైక బంధువు.

సోదరి ఖాతాలో ఉన్న డబ్బును తీసుకోవడానికి జీతూ బ్యాంకును సంప్రదించగా.. ఖాతాదారుడు స్వయంగా రావాలని లేదా వారసత్వ ధృవీకరణ పత్రాలు సమర్పించాలని బ్యాంక్ మేనేజర్ నిరాకరించారు. నిరక్షరాస్యుడైన జీతూ వద్ద మరణ ధృవీకరణ పత్రం (Death Certificate) గానీ, ఇతర చట్టపరమైన పత్రాలు గానీ లేవు. ఆ క్లిష్టమైన ప్రక్రియ అర్థం కాక ఆయన నిస్సహాయంగా ఇంటికి తిరిగి వచ్చారు.

అస్థిపంజరంతో బ్యాంకుకు: ఈ క్రమంలో సోమవారం నాడు జీతూ గ్రామ శ్మశానవాటికకు వెళ్లి, తన సోదరి అస్థికలను (అస్థిపంజరాన్ని) బయటకు తీశాడు. దానిని ఒక గుడ్డలో చుట్టి, భుజంపై వేసుకుని ఎండలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుకు వెళ్లాడు. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు నివ్వెరపోయారు. కొందరు కంటతడి పెట్టగా, మరికొందరు బ్యాంక్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒక పేదవాడికి తన సొంత డబ్బు రావడం ఇంత కష్టమా?” అని గ్రామస్థులు నిలదీశారు. అధికారులు గ్రామ సర్పంచ్‌తో మాట్లాడి లేదా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఉండాల్సిందని, కానీ మానవత్వం కంటే కాగితాలకే ఎక్కువ విలువ ఇచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల జోక్యం: సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జీతూని ఓదార్చి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కేసును మానవతా దృక్పథంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై బ్యాంకు నుండి కూడా వివరణ కోరినట్లు పోలీసులు తెలిపారు.


Posted

in

by

Tags: