“సోషల్ మీడియా కామెంట్‌తో ఉరికొయ్యల దాకా వెళ్లిన శ్రీలంక తమిళుడు.. శ్రీలంక తీవ్ర ప్రయత్నాలతో ప్రాణాలు దక్కిన అద్భుతం.. మరణశిక్ష రద్దు చేసి కరుణ చూపిన సౌదీ అరేబియా!”

సౌదీ అరేబియాలో పనిచేస్తున్న శ్రీలంకకు చెందిన తమిళ యువకుడు శివరాజ అనోజన్‌కు విధించిన మరణశిక్షను సౌదీ అరేబియా సుప్రీంకోర్టు పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సౌదీలో ఉద్యోగం చేస్తున్న అనోజన్.. మహమ్మద్ ప్రవక్త, ఇస్లాం మతంపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అతనిపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన సౌదీ న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు వెలువడిన అనంతరం శ్రీలంక, తమిళనాడుతో పాటు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, ప్రపంచ తమిళుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అనోజన్ ప్రాణాలను కాపాడాలని ప్రపంచవ్యాప్తంగా విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.

దీంతో రంగంలోకి దిగిన శ్రీలంక ప్రభుత్వం.. సౌదీ అరేబియాతో వరుస న్యాయపరమైన, దౌత్యపరమైన ముమ్మర చర్చలు జరిపింది. శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ, సౌదీలోని శ్రీలంక రాయబార కార్యాలయం చేపట్టిన దౌత్య ప్రయత్నాలు ఫలించడంతో.. సౌదీ అరేబియా సుప్రీంకోర్టు అనోజన్ మరణశిక్షను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది.

ఈ విషయాన్ని శ్రీలంక విదేశాంగ మంత్రి అరుణ్ హేమచంద్ర అధికారికంగా ధ్రువీకరించారు. అనోజన్ ప్రాణాలను కాపాడేందుకు సహకరించిన సౌదీ అరేబియా ప్రభుత్వానికి, ఈ విజయం కోసం శ్రమించిన శ్రీలంక రాయబారి, అధికారులు, ఇరుదేశాల న్యాయ బృందాలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఉరికొయ్యల అంచు దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడిన ఈ ఉదంతం ప్రపంచ తమిళులలో తీవ్ర ఊరటను నింపింది!


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *