ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పుడు అన్ని దేశాలపై పడటం ప్రారంభమైంది. కొన్నిచోట్ల పరిస్థితి చేజారిపోతోంది. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఆసియాలోని అనేక దేశాల్లో చమురు సంక్షోభం తలెత్తింది. ఆసియా దేశాలకు చమురు సరఫరా అయ్యే ప్రధాన మార్గం ఇదే కావడమే దీనికి కారణం. 26 రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం తగ్గే సూచనలు కనిపించడం లేదు. దీంతో పలు ఆసియా దేశాలు ముందుజాగ్రత్త చర్యలను అమలు చేస్తున్నాయి.
భారత్లో పరిస్థితి ఏమిటి?
భారత్లో ఇప్పటికైతే ఇంధన సంక్షోభం తలెత్తలేదు. కానీ, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల వల్ల ప్రజలు భయాందోళనతో పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. గ్యాస్, ఆయిల్ కొరత వస్తుందని ప్రజలు పొరపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ.. నిత్యావసరాల అక్రమ నిల్వలు, నల్లబజారును అరికట్టాలని ఆదేశించారు. భారత్ తన శక్తి వనరుల దిగుమతిని 27 దేశాల నుండి 41 దేశాలకు పెంచి, సరఫరాను భద్రపరుచుకుంది.
ఇతర ఆసియా దేశాల పరిస్థితి:
| దేశం | ప్రస్తుత పరిస్థితి / ఆంక్షలు |
| పాకిస్థాన్ | ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని. స్కూళ్లు, కాలేజీలు రెండు వారాల పాటు బంద్. పెట్రోల్ ధర లీటరుకు ₹350 దాటింది. |
| బంగ్లాదేశ్ | ఇంధన నిల్వలు 9 నుండి 14 రోజులకు మాత్రమే ఉన్నాయి. స్కూళ్లలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. రోజుకు 5 గంటల విద్యుత్ కోత విధిస్తున్నారు. |
| శ్రీలంక | ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. పెట్రోల్/డీజిల్ కొనుగోలుపై వారానికి 15 లీటర్ల పరిమితి విధించారు. ‘QR కోడ్’ ఆధారిత ఇంధన పాస్ విధానం అమలులో ఉంది. |
| ఫిలిప్పీన్స్ | ‘జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి’ (National Energy Emergency) ప్రకటించింది. చమురు నిల్వలు కేవలం 45 రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. |
| థాయిలాండ్ | ప్రభుత్వ రంగంలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అమలు. విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని ఆదేశం. |
| తైవాన్ | ఎల్ఎన్జీ (LNG) నిల్వలు కేవలం 11 రోజులకు మాత్రమే సరిపోతాయి. |
| దక్షిణ కొరియా | వాహనాల నంబర్ ప్లేట్ ఆధారంగా రోడ్లపైకి వచ్చేలా ఆంక్షలు విధిస్తున్నారు. |
| జపాన్ | తమ నిల్వల నుండి చమురును మార్కెట్లోకి విడుదల చేయాలని IEAను కోరింది. |
