వారాంతపు సెలవుల తర్వాత సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కావడమే ఇన్వెస్టర్ల పాలిట శాపంగా మారింది. మధ్యప్రాచ్యంలో ముదిరిన యుద్ధ మేఘాలు భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం కావడం, దానికి తోడు ఇరాన్ రేవులను దిగ్బంధిస్తామన్న డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలతో మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా పతనమవ్వగా, నిఫ్టీ కూడా ‘ధడమ్’ మంటూ కిందకు పడిపోయింది.
పేకమేడలా కూలిన సూచీలు
సోమవారం ఉదయం 9:15 గంటలకు మార్కెట్ ఓపెన్ కావడమే భారీ నష్టాలతో మొదలైంది.
- సెన్సెక్స్: ఉదయం 9:20 గంటల సమయానికి 1,624.21 పాయింట్లు (2.09%) నష్టపోయి 75,926.04 వద్ద ట్రేడవుతోంది.
- నిఫ్టీ: దాదాపు 471 పాయింట్లు (1.96%) కోల్పోయి 23,579.45 స్థాయికి పడిపోయింది. ప్రీ-ఓపెనింగ్ సెషన్‌లోనే మార్కెట్ గందరగోళంగా ఉండటంతో మదుపర్లు బెంబేలెత్తిపోయారు. భారీ అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇన్వెస్టర్ల సంపద నిమిషాల్లోనే ఆవిరైపోయింది.
కుదేలైన బ్యాంకింగ్, ఆటో రంగాలు
మార్కెట్ పతనంలో అన్ని రంగాలు ఎర్రబారాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటో, రియల్టీ షేర్లు కుప్పకూలాయి.
- టాప్ లూజర్స్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), మారుతీ సుజుకి, ఐషర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు భారీగా నష్టపోయాయి.
- కేవలం లార్జ్ క్యాప్ మాత్రమే కాదు, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ కూడా 2 శాతానికి పైగా పడిపోయింది.
మార్కెట్ మునిగిపోవడానికి ప్రధాన కారణాలు:
- ట్రంప్ హెచ్చరికలు: ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించాలని ట్రంప్ ఆదేశించడంతో అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలుగుతుందన్న భయం నెలకొంది.
- చర్చల వైఫల్యం: ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగియడం.
- ముడిచమురు సెగ: యుద్ధ భయంతో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ 102 డాలర్లు, డబ్ల్యూటీఐ (WTI) 104 డాలర్ల మార్కును దాటేశాయి. భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాలకు ఇది పెను భారంగా మారనుంది.
- గ్లోబల్ మార్కెట్ల ప్రభావం: జపాన్ నైకీ, దక్షిణ కొరియా కోస్పీ, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ సూచీలు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.
ముందున్నది ముసళ్ల పండగ?
మధ్యప్రాచ్యంలో టెన్షన్లు ఇలాగే కొనసాగితే మార్కెట్లలో అనిశ్చితి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముడిచమురు ధరల పెరుగుదల వల్ల రూపాయి విలువ బలహీనపడటం, విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) పెద్ద ఎత్తున నిధులను వెనక్కి తీసుకోవడం మార్కెట్‌ను మరింత ఒత్తిడికి గురిచేయవచ్చు. ఈ వారం మొత్తం మార్కెట్లలో భారీ ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందని నిపుణులు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తున్నారు.
