చెన్నై: రాజకీయ క్షేత్రంలో ప్రత్యర్థులుగా ఉండి, ఎన్నికల్లో తీవ్రంగా తలపడిన స్టాలిన్, వైకో, అన్బుమణి రామదాస్, సీమాన్ వంటి నేతలను ముఖ్యమంత్రి విజయ్ నేడు స్వయంగా కలిసి ‘రాజకీయ నాగరికత’ను చాటుకున్నారు.
అదే సమయంలో, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (EPS)ని విజయ్ కలవకపోవడం రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలకు, చర్చలకు దారితీసింది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. నేడు అసెంబ్లీ సమావేశం కాగా, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే విజయ్.. మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయనను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు.
ఇంటికే వెళ్లి కలిసిన విజయ్
అదేవిధంగా వైకో, అన్బుమణి రామదాస్, సీమాన్ వంటి నేతల నివాసాలకు స్వయంగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అయితే, ఏఐఏడీఎంకే (AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని మాత్రం విజయ్ కలవలేదు. గతంలో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఈపీఎస్‌ను విజయ్ పక్కన పెట్టడం వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏఐఏడీఎంకేలో చీలిక
ప్రస్తుతం ఏఐఏడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఎడప్పాడి నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది. మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం, సీ విజయభాస్కర్ వంటి కీలక నేతలు ఎడప్పాడికి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. అసెంబ్లీలో ఎస్పీ వేలుమణిని పక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌కు లేఖ కూడా ఇచ్చారు. ఈ వర్గం విజయ్ నేతృత్వంలోని ‘తమిళ వెట్రి కళగం’ (TVK) పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
పరస్పరం పలకరించుకోని పళనిస్వామి – విజయ్
ఇలాంటి తరుణంలో ఎడప్పాడిని కలిస్తే, పార్టీలోని ఇతర అసమ్మతి వర్గాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి విజయ్ ఈ భేటీని విస్మరించి ఉండవచ్చు. అంతేకాకుండా, నేడు అసెంబ్లీలో కూడా ఎడప్పాడి, విజయ్ పరస్పరం పలకరించుకోలేదు. ఎడప్పాడి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తున్నప్పుడు విజయ్ వైపు చూసి నమస్కారం చేసినట్లు అనిపించినా, విజయ్ మాత్రం ఎటువంటి స్పందన లేకుండా మౌనంగా ఉండిపోయారు. అయితే, రేపు ఎడప్పాడి పళనిస్వామి పుట్టినరోజు కావడంతో, రేపు ఆయనను విజయ్ కలిసే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.
చరిత్ర పునరావృతం.. విజయ్ చాటుకున్న రాజకీయ నాగరికత
1967 తర్వాత తమిళనాడులో ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) అధికారంలోకి వచ్చింది. ద్రవిడ పార్టీలు లేకుండా ఒక కొత్త పార్టీ అధికారం చేపట్టడం తమిళ రాజకీయాల్లో పెద్ద మార్పు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్ష నేతల ఇళ్లకు వెళ్లి కలవడం అనేది 1967లో అన్నాదురై (అన్నా) హయాంలో జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు, అన్నాదురై స్వయంగా కామరాజర్ ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పుడు డీఎంకే ఓడిపోయిన తరుణంలో, విజయ్ కూడా అదే బాటలో నడిచి స్టాలిన్‌ను కలిసి గౌరవించారు.
