శ్రీమంతులు కావాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ, అందుకోసం కొన్ని నియమాలను పాటించాలి మరియు కొన్ని తప్పులకు దూరంగా ఉండాలి. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ప్రకారం, ధనవంతులు కావాలనుకునే వారు పొరపాటున కూడా చేయకూడని ఆ 5 తప్పులు ఇవే:
- క్రెడిట్ కార్డుల అతి వినియోగం
చాలామంది అనవసరంగా క్రెడిట్ కార్డులను ఎక్కువగా వాడుతుంటారు. కానీ, క్రెడిట్ కార్డులపై ఉండే భారీ వడ్డీ రేట్లు (దాదాపు 18% లేదా అంతకంటే ఎక్కువ) పెద్ద సమస్యగా మారతాయి. ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లించడం అంటే మన సంపాదనను వృథా చేసుకోవడమే. అందుకే, ముందుగా అధిక వడ్డీ ఉన్న అప్పులను తీర్చివేయాలని బఫెట్ సూచిస్తారు. - తొందరగా డబ్బు సంపాదించాలనే ఆశ
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని చేసే ప్రయత్నాలు తరచుగా నష్టాలకే దారితీస్తాయి. బఫెట్ మాటల్లో చెప్పాలంటే.. డబ్బు పెరగడానికి సమయం పడుతుంది. ఒక విత్తనం నాటితే అది పెద్ద చెట్టు కావడానికి ఏళ్ల సమయం పట్టినట్లే, పెట్టుబడులు కూడా నెమ్మదిగా పెరుగుతాయి. అందుకే మొదట పెట్టుబడి పెట్టి, మిగిలిన డబ్బును ఖర్చు చేయడం ఉత్తమ అలవాటు. - స్థోమతకు మించి ఖరీదైన ఇల్లు
చాలామంది తమ అర్హతకు మించి పెద్ద ఇల్లు కొనడానికి భారీగా అప్పులు చేస్తారు. దీనివల్ల వారి ఆదాయంలో సింహభాగం EMIలకే సరిపోతుంది. ఫలితంగా పొదుపు, పెట్టుబడికి డబ్బు మిగలదు. బఫెట్ ప్రకారం, ఇల్లు అనేది నివసించడానికి కావాల్సిన చోటు మాత్రమే, అది ఇతరులకు చూపించుకునే వస్తువు కాదు. - జూదం, లాటరీల వంటి వ్యసనాలు
త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు లాటరీ, జూదం వంటి వాటిలో డబ్బు పెడతారు. ఆరంభంలో చిన్న మొత్తంతో మొదలైనా, క్రమంగా ఇది పెద్ద నష్టాలకు దారి తీస్తుంది. ఇలాంటి అనవసరపు రిస్క్‌లకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. - స్టేటస్ కోసం కొత్త కారు కొనడం
మధ్యతరగతి వారు తమ స్టేటస్ పెంచుకోవడం కోసం అప్పులు చేసి కొత్త కారు కొంటారు. కానీ కారు కొన్న క్షణం నుండే దాని విలువ తగ్గడం (Depreciation) మొదలవుతుంది. మరోవైపు ఏళ్ల తరబడి EMIలు కట్టాల్సి వస్తుంది. వారెన్ బఫెట్ స్వయంగా ఎంతో కాలం పాత కారునే వాడేవారు. కేవలం హోదా కోసం కొత్త కారు కొనడం సరైన నిర్ణయం కాదని ఆయన అంటారు.
