మహారాష్ట్ర: అమరావతిలో ఒక యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులు 18 ఏళ్ల కళాశాల విద్యార్థిని మరియు ఆమె స్నేహితుడిని అడ్డుకుని మొదట దాడి చేశారు.
ఆ తర్వాత యువకుడిని కట్టేసి, అతని ముందే యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఘటన జరిగిన 12 గంటల్లోనే నిందితులకు బేడీలు వేశారు.
ఫ్రేజర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని భాన్ఖేడ అటవీ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అడవిలోకి లాక్కెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వీడియో తీసిన నిందితులు: అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, నిందితులు అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియో తీశారు. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే ఈ వీడియోను వైరల్ చేస్తామని యువతిని బెదిరించారు.
అడవిని జల్లెడ పట్టిన పోలీసులు – 12 గంటల్లో అరెస్ట్: పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు తన స్నేహితుడితో కలిసి మొపెడ్పై తిరిగి వస్తుండగా ఐదుగురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. వారిద్దరినీ అడవిలోకి లాక్కెళ్లి డబ్బుల కోసం దాడి చేశారు. బాధితురాలు తన వద్ద ఉన్న 120 రూపాయలను వారికి ఇచ్చింది. అయినప్పటికీ, వారు ఆమెపై అత్యాచారం చేశారు.
ఘటన గురించి తెలియగానే పోలీస్ కమిషనర్ రాకేశ్ ఓలా మార్గదర్శకత్వంలో బృందాలు రాత్రంతా అడవిని జల్లెడ పట్టాయి. ఆదివారం తెల్లవారుజామున ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిపై సామూహిక అత్యాచారం మరియు దోపిడీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం బాధిత యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
