మరణం అనేది ఎల్లప్పుడూ తీవ్ర విషాదం, నిశ్శబ్దం నిండిన వాతావరణం. బంధువులు, స్నేహితులు నలుపు లేదా తెలుపు దుస్తులు ధరించి, కన్నీటితో నివాళులు అర్పించడం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆచారం.
అయితే, తన ప్రాణస్నేహితుడి అంత్యక్రియలకు ఒక వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించే బ్రైట్ పింక్ సాక్స్‌లు, నియాన్ రంగు మహిళల గౌను ధరించి వచ్చిన దృశ్యం అక్కడున్న వారిని తొలుత ఆశ్చర్యానికి గురిచేసినా, నెటిజన్లను మాత్రం తీవ్ర భావోద్వేగంలో ముంచెత్తింది.
పైపైకి చూస్తే ఇది ఒక ఎగతాళిలానో లేదా చనిపోయిన వ్యక్తిని అవమానించే చర్యలానో అనిపించవచ్చు. కానీ, ఈ విచిత్రమైన వేషధారణ వెనుక గుండెల్ని పిండేసే ఒక అద్భుతమైన స్నేహ బంధం దాగి ఉంది.
మరణించిన స్నేహితుడు, ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచీ విడదీయరాని ప్రాణమిత్రులు. ఒకసారి వీరిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో.. “మనలో ఎవరైనా ఒకరు ముందు చనిపోతే, బతికున్నవాడు ఆ అంత్యక్రియలకు అమ్మాయిలు వేసుకునే ఫన్నీ నియాన్ గౌను వేసుకునే రావాలి” అని సరదాగా ఒకరికొకరు ఒట్టు వేసుకున్నారు.
స్నేహితుడు శాశ్వతంగా దూరమైన ఆ విషాద సమయంలో కూడా తానిచ్చిన మాటను ఆ నిజమైన మిత్రుడు నిలబెట్టుకున్నాడు. చుట్టూ ఉన్నవాళ్లు విచిత్రంగా చూసినప్పటికీ, లోకం ఏమనుకుంటుందోనని ఏమాత్రం పట్టించుకోకుండా, స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ఆ డ్రెస్ వేసుకుని వచ్చి కన్నీటి వీడ్కోలు పలికాడు.
“వేసుకునే బట్టలు ముఖ్యం కాదు.. మనసులోని ప్రేమాభిమానాలు, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నైజమే నిజమైన స్నేహం” అని నిరూపించిన ఈ హృదయ విదారక ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి కళ్లనూ చెమర్చేలా చేస్తోంది.

Leave a Reply