నేటి తరం యువత పెళ్లి విషయంలో చాలా భిన్నంగా ఆలోచిస్తున్నారు. అందరి పెళ్లిళ్ల కంటే తమ పెళ్లి ప్రత్యేకం (Special)గా ఉండాలని కొందరు కోరుకుంటే, తమ పెళ్లి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావాలని మరికొందరు పిచ్చి పనులకు ఒడిగడుతున్నారు.
అలాంటి ఒక పెళ్లి ఇప్పుడు ఆ జంట అనుకున్నట్లే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దానికి కారణం, ఈ జంట స్మశానంలో పెళ్లి చేసుకోవడం! పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చేరాల్సింది స్మశానానికే అన్నది నిజమే అయినప్పటికీ, అక్కడ పెళ్లి చేసుకోవడం అనేది ఎవరూ ఊహించని విషయం. గాలిలో, నీటిలో.. ఇలా రకరకాల చోట్ల పెళ్లిళ్లు చేసుకున్న వారి గురించి మనం విన్నాం. కానీ ఈ జంట స్మశానాన్ని ఎంచుకుని పలువురి ఆగ్రహానికి గురైంది.
ఎక్కడ జరిగింది?
ఈ వింత ఘటన ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో జరిగింది. ఘజియాబాద్‌కు చెందిన ఒక జంట ఈ వివాదానికి తెరలేపింది. స్మశాన వాటికను కళ్యాణ మండపంగా మార్చేసి, అక్కడ వధూవరులు పూల మాలలు మార్చుకోవడం సహా అన్ని పెళ్లి తంతులను పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. మార్చులా ప్రాంతంలోని రామగంగ మరియు బదన్‌గఢ్ నదుల సంగమ క్షేత్రంలో ఈ ఘటన జరిగింది. అత్యంత సున్నితమైన ఈ ప్రదేశంలో పెళ్లి వేడుక నిర్వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు.
తీవ్ర విమర్శలు
ఇది తమ మతపరమైన నమ్మకాలను, సంప్రదాయాలను అవమానించడమేనని స్థానికులు వాదిస్తున్నారు. ఇంటర్నెట్‌లో దీనిపై భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. కొందరు దీనిని “సృజనాత్మకత” అని అంటున్నప్పటికీ, మెజారిటీ ప్రజలు ఇది సామాజిక మరియు మతపరమైన నిబంధనల ఉల్లంఘన అని కొట్టిపారేస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించే చోట ఇటువంటి శుభకార్యాలు చేయడం ఆమోదయోగ్యం కాదని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
విచారణకు ఆదేశం
ఈ విషయాన్ని యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. పబ్లిక్ ప్రదేశాల్లో ఏ కార్యక్రమం చేయాలన్నా ముందస్తు అనుమతి అవసరమని, స్మశాన వాటికలో అనుమతి లేకుండా పెళ్లి చేయడం నిబంధనల ఉల్లంఘన అని తహశీల్దార్ అబిద్ అలీ స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, పెళ్లి బాధ్యతలు చూసుకున్న రిసార్ట్ మేనేజర్ రాకేశ్ శర్మ మాట్లాడుతూ.. “తాము ఆ ప్రదేశం గురించి ముందే చెప్పామని, కానీ వారే ఆ స్థలాన్ని ఎంచుకున్నారని” వివరణ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌లో పెరుగుతున్న ‘వెడ్డింగ్ డెస్టినేషన్’ ట్రెండ్‌లో భాగంగా విభిన్న ప్రదేశాల కోసం వెతుకుతూ ఇలా వివాదాలకు దారి తీయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
