బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఒక ఉన్మాది తన భార్య గొంతు కోసి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. మృతురాలిని సహాదుల్ మియా భార్య నాజియా ఖాతూన్ (30)గా గుర్తించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఉదయం గొడవ.. సాయంత్రానికి శవం
ఈ హృదయవిదారక ఘటన కటెయా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమేయా బాంకే గ్రామంలో చోటుచేసుకుంది. నాజియా ఖాతూన్ ఇద్దరు పిల్లల తల్లి. ఈ దారుణం గురించి తెలియగానే గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సదర్ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ (FSL) బృందం కూడా క్షేత్రస్థాయిలో ఆధారాలను సేకరించింది. కేసు తీవ్రతను బట్టి హతువా ఎస్డీపీఓ (SDPO) ఆనంద్ మోహన్ గుప్తా స్వయంగా విచారణను పర్యవేక్షించారు.
ఘటనకు కారణం?
ప్రాథమిక సమాచారం ప్రకారం, నాజియా ఖాతూన్‌కు సహాదుల్ మియాతో 2019లో వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుండి వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఘటన జరిగిన రోజు ఉదయం కూడా ఏదో విషయంలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ కోపంలో నిందితుడు కత్తితో భార్యపై దాడి చేసి ఆమె గొంతు కోశాడు.
ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్డీపీఓ ఆనంద్ మోహన్ గుప్తా తెలిపారు.
