రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం చోటుచేసుకున్న ఒక విస్తుపోయే ఘటన యావత్ విద్యాశాఖను తీవ్రంగా కుదిపేసింది.
విద్యార్థుల భద్రతకు బాధ్యత వహించాల్సిన ప్రధానోపాధ్యాయుడే (ప్రిన్సిపాల్), విద్యార్థినులతో కలిసి బట్టలు లేకుండా డ్యామ్‌లో స్నానం చేసిన వీడియో వైరల్ కావడంతో అధికారులు ఆయనను తక్షణమే సస్పెండ్ చేశారు.
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా థానాగాజీ పరిధిలోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమం ముగిసిన తర్వాత, విద్యార్థులను విహారయాత్రకు (టూర్) తీసుకెళ్తున్నామని, ఈత నేర్పిస్తామని చెప్పి పాఠశాల ప్రిన్సిపాల్ వారిని సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘బదాజ్ డ్యామ్’ వద్దకు తీసుకెళ్లాడు. ఈ టూర్‌లో 20 నుంచి 25 మంది వరకు పెద్ద తరగతుల విద్యార్థినులు పాల్గొన్నట్లు సమాచారం.
అయితే, అక్కడ జరిగిన పరిణామాలే పెను వివాదానికి దారితీశాయి. ఎలాంటి భద్రతా పరికరాలు, లైఫ్ జాకెట్లు లేకుండా విద్యార్థినులను నీటిలోకి దింపారు. అంతేకాకుండా, ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా ఆ ప్రమాదకరమైన డ్యామ్ నీటిలో విద్యార్థినులతో కలిసి ప్రిన్సిపాల్ నగ్నంగా జలకాలాడాడు.
అక్కడ జరిగిన ఈ అసభ్యకరమైన చేష్టలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. వీడియోలో ప్రిన్సిపాల్ విద్యార్థినులతో కలిసి అసభ్యకర రీతిలో స్నానం చేస్తున్న దృశ్యాలు బయటకు రావడంతో గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.
వెంటనే గ్రామస్థులు పాఠశాల వద్దకు భారీగా చేరుకుని ముట్టడించడంతో పాటు, పోలీసులు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటన తీవ్రతను గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి, సంబంధిత ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ సత్వర ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రిన్సిపాల్ చేసిన ఈ అనైతిక చర్య ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply