హార్ముజ్ వద్ద ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడి.. 5,000 పౌండ్ల ‘బంకర్ బస్టర్’ బాంబులతో విధ్వంసం!

హార్ముజ్ జలసంధిని తిరిగి ప్రారంభించే దిశగా అమెరికా సైన్యం తొలి భారీ చర్యను చేపట్టింది. ఈ కీలక జలమార్గం సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై తమ అస్త్రశస్త్రాల్లోని అత్యంత శక్తివంతమైన బాంబులతో దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది.

హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ తీరప్రాంతంలో ఉన్న పటిష్టమైన క్షిపణి కేంద్రాలపై అనేక 5,000 పౌండ్ల (సుమారు 2,268 కిలోగ్రాములు) డీప్ పెన్రేటర్ బాంబులను ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. “అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పుగా మారిన ఇరాన్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణి స్థావరాలను అమెరికా దళాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి” అని సెంట్రల్ కమాండ్ తన ప్రకటనలో పేర్కొంది.

అమెరికా మరియు ఇజ్రాయెల్ తమపై యుద్ధం ప్రకటించడాన్ని నిరసిస్తూ, ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ప్రవహించే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ దిగ్బంధం వల్ల సముద్ర రవాణా నిలిచిపోయి, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి.

ట్రంప్ పిలుపును తిరస్కరించిన మిత్రదేశాలు: చమురు ఎగుమతులపై ఉన్న దిగ్బంధాన్ని తొలగించేందుకు సహాయం చేయాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపును నాటో సహా మెజారిటీ మిత్రదేశాలు తిరస్కరించాయి. తాను కోరుకున్న ఈ యుద్ధానికి (War of Choice) మద్దతు లభించడం లేదని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. తాము నాటోకు ఎంతో సహాయం చేసినా, ఇప్పుడు తమకు మద్దతు లభించడం లేదని ఆయన మండిపడ్డారు. ఇరాన్ అణు ఆయుధాన్ని పొందకుండా అడ్డుకోవడం మిత్రదేశాల ప్రయోజనాలకే మంచిదని ఆయన హితవు పలికారు.

మరోవైపు, తమ అణు కార్యక్రమం కేవలం విద్యుత్ ఉత్పత్తి వంటి శాంతియుత ప్రయోజనాల కోసమేనని, అణు ఆయుధాలను అభివృద్ధి చేసే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ నొక్కి చెప్పింది. మిత్రదేశాల మద్దతు లేకపోయినా, ఈ పోరాటాన్ని తన భుజస్కంధాలపై మోయడానికి సిద్ధమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ముప్పుపై తనకున్న ‘అంచనా’ (Feeling) ప్రకారమే ఈ యుద్ధం మొదలైందని, తన మనసు (Gut) చెప్పినప్పుడు మాత్రమే ఇది ముగుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఏమిటీ 5,000 పౌండ్ల డీప్ పెన్రేటర్ బాంబులు? వీటిని ‘బంకర్ బస్టర్’ అని పిలుస్తారు. 2022 నివేదిక ప్రకారం, వీటిలో ఒక్కో బాంబు ధర సుమారు 2.88 లక్షల డాలర్లు (సుమారు రూ. 2.4 కోట్లు). భూమి లోపల లోతుగా పాతిపెట్టిన లేదా అత్యంత పటిష్టమైన కాంక్రీట్ నిర్మాణాలను ధ్వంసం చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. అయితే, గత ఏడాది ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ప్రయోగించిన 30,000 పౌండ్ల బాంబుల కంటే ఇవి తక్కువ శక్తివంతమైనవి.


Posted

in

by

Tags: