బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా న్యూఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఇరాన్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వ్యాపారవేత్తలు, మతపెద్దలు, మేధావుల కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్కు చెందిన హిందూ మత గురువు స్వామి సతీశాచార్యతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట్లాడుతున్నారు. ఆ సమయంలో అధ్యక్షుడు ఒక్కసారిగా కిందకు వంగుతున్నట్లు కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చకు దారితీసింది.
ఇరాన్ అధ్యక్షుడు హిందూ మత గురువు పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే, తనకు అందించిన ఒక లేఖ చేతిలో నుంచి జారి కింద పడటంతో దానిని తీసుకునేందుకే అధ్యక్షుడు కిందకు వంగారని ఇరాన్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. వీడియోను తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది.
మరో కార్యక్రమంలో మాట్లాడిన అధ్యక్షుడు పెజెష్కియాన్.. ఇరాన్కు పొరుగు గల్ఫ్ దేశాలతో ఎలాంటి శత్రుత్వం లేదని తెలిపారు. అయితే, ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. అమెరికా ఈ సైనిక స్థావరాలను ఉపయోగించి దాడులు నిర్వహిస్తున్నందువల్లే తాము వాటిని వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, బ్రిక్స్ సదస్సులో విడుదల చేసిన న్యూఢిల్లీ డిక్లరేషన్లో మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గల్ఫ్ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు దౌత్యపరమైన మార్గాలు, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని బ్రిక్స్ కూటమి పిలుపునిచ్చింది.
