వ్యాపార ప్రచారం కోసం ఎంతకైనా తెగిస్తారా? దైవ చింతనతో జరుపుకునే పండుగ వేళ దేవుడినే అవమానిస్తారా? కేరళలోని చేర్తలకు చెందిన ‘మెహర్ మండి అండ్ గ్రిల్స్’ రెస్టారెంట్ చేసిన ఒక పిచ్చి పని ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది. పవిత్రమైన ‘విషు’ పండుగ శుభాకాంక్షలు చెబుతూ, మాంసాహార చికెన్ వంటకం పక్కన శ్రీకృష్ణుడి ఫోటోను ముద్రించి సోషల్ మీడియాలో వదిలింది. ఇది చూసిన నెటిజన్లు “హిందువుల మనోభావాలు అంత చౌకగా కనిపిస్తున్నాయా?” అంటూ రెస్టారెంట్‌ను ఉతికి ఆరేస్తున్నారు.
అసలేం జరిగింది?
కేరళలో విషు పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సదరు రెస్టారెంట్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ఒకవైపు చికెన్ మండి వంటకం, మరోవైపు శ్రీకృష్ణుడి బొమ్మ ఉన్నాయి. సాధారణంగా హిందూ ధర్మంలో దేవుడికి శాఖాహార నైవేద్యాలు సమర్పిస్తారు. అటువంటిది సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మను మాంసాహారంతో ముడిపెడుతూ పోస్టర్ వేయడం తీవ్ర దుమారం రేపింది.
సోషల్ మీడియాలో ‘బహిష్కరణ’ సెగ
ఈ ఫోస్టర్ వైరల్ కావడంతో నెటిజన్లు ‘బాయ్‌కాట్ మెహర్ మండి’ అంటూ ప్రచారాన్ని మొదలుపెట్టారు.
నెటిజన్ల ప్రశ్నలు: “కనీస సంస్కారం లేదా? డిజైన్ చేసేటప్పుడు మీ బుద్ధి ఎక్కడికి పోయింది? హిందువుల పండుగలను అవమానించడమే పనిగా పెట్టుకున్నారా?” అంటూ X (ట్విట్టర్) వేదికగా విరుచుకుపడుతున్నారు. కేవలం క్షమాపణలు చెబితే సరిపోదని, ఇటువంటి వారి వ్యాపారాలను పూర్తిగా మూయించే వరకు వదలకూడదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“అది డిజైనర్ తప్పు”.. రెస్టారెంట్ వెర్రి వాదన
వివాదం ముదరడంతో రెస్టారెంట్ యాజమాన్యం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్షమాపణ వీడియోను విడుదల చేసింది. “మేము ఆ పోస్టర్‌ను బయట డిజైనర్ ద్వారా చేయించాం. సరిగా చూసుకోకుండానే పోస్ట్ చేశాం. ఇది కావాలని చేసిన పని కాదు, పొరపాటున జరిగింది” అని వివరణ ఇచ్చింది. అయితే ఈ వాదనను ఎవరూ నమ్మడం లేదు. ఐడియా మీది కాకుండా డిజైనర్ సొంతంగా ఎలా చేస్తారని, యాజమాన్యం అనుమతి లేకుండా పోస్ట్ ఎలా అవుతుందని నెటిజన్లు నిలదీస్తున్నారు.
హిందూ మనోభావాలంటే అంత లోకువా?
కార్పొరేట్ సంస్థలు మరియు వ్యాపార సంస్థలు కావాలనే హిందూ దేవతలను కించపరుస్తూ ప్రచారాలు చేస్తున్నాయని, విమర్శలు రాగానే ఒక చిన్న క్షమాపణ చెప్పి తప్పుించుకుంటున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. “హిందూ సెంటిమెంట్ అంత చౌకగా దొరుకుతుందా?” అన్న ప్రశ్న ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతోంది.
ప్రస్తుతానికి సదరు రెస్టారెంట్ ఆ పోస్టర్‌ను తొలగించినప్పటికీ, వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
