హెయిర్ డై వేసుకునే వారికి హెచ్చరిక! ఈ విషయాలను అస్సలు మర్చిపోకండి

తలపై ఒక్క తెల్ల జుట్టు కనిపిస్తే చాలు, అప్పటివరకు ఉన్న సంతోషం కాస్తా ఆవిరైపోతుంది. మనసంతా ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది.

ఒకటో రెండో అయితే వాటిని పీకేసి సర్దుకుంటారు. కానీ నరవడం (Grey hair) ఎక్కువైతే? అప్పుడు జుట్టుకు రంగు వేసుకోవడం తప్ప మరో మార్గం ఉండదు. సాధారణంగా జుట్టు తెల్లబడటాన్ని వృద్ధాప్య లక్షణంగా భావిస్తారు. అయితే వయసు రాకముందే జుట్టు నరుస్తుంటే, చాలామంది హెయిర్ డైలు వాడటం ప్రారంభిస్తారు. నేడు మార్కెట్లో రకరకాల హెయిర్ డైలు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిని తరచుగా వాడేవారిలో క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా మూత్రాశయ క్యాన్సర్ (Bladder Cancer) వచ్చే అవకాశం ఉందట. హెయిర్ డై వాడకం వల్ల ఈ ముప్పు ఎలా పెరుగుతుంది, దీనిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

రసాయనాల ప్రభావం

చాలా హెయిర్ డై ఉత్పత్తులలో ఉపయోగించే రసాయనాలు క్యాన్సర్‌కు కారకాలుగా మారవచ్చు. వీటిలోని కార్సినోజెన్, అరోమాటిక్ అమీన్‌లు వంటివి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. అందువల్ల, ఇటువంటి పదార్థాలను హెయిర్ డై తయారీలో వాడకూడదని నిషేధాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చే ఉత్పత్తులు కఠినమైన నాణ్యత పరీక్షల తర్వాతే వస్తాయి కాబట్టి, క్యాన్సర్ కారక పదార్థాలు నేరుగా ప్రజలకు చేరే అవకాశం తక్కువే.

ఎవరికి ముప్పు ఎక్కువ?

హెయిర్ డైలతో రోజూ పనిచేసే హెయిర్ డ్రెస్సర్లు, బార్బర్లు నిరంతరం ఆ రసాయనాల ప్రభావానికి లోనవుతారు. అందుకే వారు వీటిని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చర్మంపై నేరుగా రసాయనాలు పడకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. కేవలం హెయిర్ డై కెమికల్స్ మాత్రమే కాకుండా, రసాయన పరిశ్రమల్లో పనిచేసే వారు కూడా మూత్రాశయ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. దీనితో పాటు ధూమపానం, ఇతర ఇన్ఫెక్షన్లు కూడా ఈ క్యాన్సర్‌కు కారణం కావొచ్చు.

కేవలం హెయిర్ డైలే కాకుండా, హెయిర్ స్ట్రెయిటనింగ్ (Straightening) మరియు స్మూతనింగ్ (Smoothing) ఉత్పత్తులలో ఉండే రసాయనాలు కూడా రొమ్ము క్యాన్సర్, లుకేమియా వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూత్రాశయ క్యాన్సర్ లక్షణాలు ఏమిటి?
  • మూత్రంలో రక్తం పడటం.
  • మూత్ర విసర్జన సమయంలో పొత్తికడుపులో నొప్పి.
  • అతి మూత్ర విసర్జన చేయడం (Frequent Urination). ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

సంక్షిప్తంగా చెప్పాలంటే, క్యాన్సర్ కారక రసాయనాలు లేని నాణ్యమైన హెయిర్ డైలను వాడటం సురక్షితం. అయినప్పటికీ, వీటిని అతిగా వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.


Posted

in

by

Tags: