భర్త లేదా కుటుంబ పెద్ద చట్టబద్ధమైన అప్పులు తీర్చకుండానే మరణిస్తే, ఆ అప్పులను వారి భార్య లేదా పిల్లలు తమ సొంత ఆస్తుల నుంచి చెల్లించాలా? అనే అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక స్పష్టీకరణ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అనేక కుటుంబాలకు ఈ తీర్పు ఒక దిశానిర్దేశం చేస్తుంది.
హైకోర్టు ఏమని చెప్పింది?
మరణించిన వ్యక్తి చేసిన చట్టబద్ధమైన అప్పులను, వారసత్వంగా వచ్చిన ఆస్తుల పరిధి వరకు మాత్రమే ప్రభుత్వం లేదా రుణదాతలు వసూలు చేయవచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేగానీ, భార్య మరియు పిల్లలు సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు, జీతాలు, ఆదాయం లేదా ఇతర వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసే అధికారం ఎవరికీ లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ కీలక తీర్పును వెలువరించారు.
కేసు వివరాలు:
కామారెడ్డి జిల్లా పోస్ట్ ఆఫీస్ అధికారి శ్రీనివాస్ రెడ్డిపై ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (NREGS) నిధులను రూ. 14.89 లక్షలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి మరణించే సమయానికి ఆయనపై క్రిమినల్ కేసు విచారణలో ఉంది. ఆయన మరణం తర్వాత, జిల్లా అధికారులు ఆయన కుటుంబానికి చెందిన పూర్వీకుల వ్యవసాయ భూమిని జప్తు చేసి వేలం వేసే ప్రక్రియను ప్రారంభించారు. దీనిపై శ్రీనివాస్ రెడ్డి భార్య యశోద తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తకు ఉన్న ఆస్తి వాటా వరకు మాత్రమే బకాయిలను వసూలు చేయాలని, తన మరియు తన ఇద్దరు కుమారుల వాటా ఆస్తులను జప్తు చేయకూడదని ఆమె పిటిషన్‌లో కోరారు.
కోర్టు స్పష్టీకరణ:
ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, మరణించిన వ్యక్తి నుంచి ఆస్తులు పొందిన వారసులు, ఆ అప్పుల బాధ్యత నుంచి పూర్తిగా తప్పించుకోలేరని పేర్కొంది. అయితే, ఆ బాధ్యత అనేది కేవలం వారసత్వంగా పొందిన ఆస్తి విలువకు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది. జీవిత భాగస్వామి లేదా పిల్లలు కష్టపడి సంపాదించిన ఇల్లు, భూమి, జీతం, బ్యాంకు పొదుపులు లేదా ఇతర వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. వ్యక్తి మరణించినప్పుడు, వారు చేసిన అప్పులను వారి పూర్వీకుల ఆస్తిలో లేదా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో ఉన్న వారి వాటా నుంచి మాత్రమే వసూలు చేయవచ్చు. మృతుల వ్యక్తిగత అప్పుల కోసం వారసుల సొంత ఆస్తులను జప్తు చేయడానికి చట్టంలో ఎటువంటి అవకాశం లేదు.
