ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్ దేహదారుఢ్య పరీక్షల్లో కవల సోదరులు చేసిన మోసం తీవ్ర కలకలం రేపింది.
ఆగ్రాకు చెందిన భూపేంద్ర అనే యువకుడు పోలీస్ ఉద్యోగానికి సంబంధించిన రాతపరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత నిర్వహించిన శారీరక కొలతల పరీక్షలో అతని ఎత్తు 166.4 సెం.మీ. మాత్రమే ఉండటంతో, నిర్ణీత ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నాడంటూ అధికారులు అతడిని అనర్హుడిగా ప్రకటించారు. దీంతో అతడు రీ-వెరిఫికేషన్ (మళ్లీ కొలవడం) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ సోదరులిద్దరూ పన్నిన పన్నాగం మొదలైందని పోలీసులు వెల్లడించారు.
మొదటి పరీక్షలో తక్కువగా ఉన్న ఎత్తు సమస్యను అధిగమించడానికి, భూపేంద్రకు బదులుగా అతని కవల సోదరుడైన భూపేష్ను పరీక్షకు పంపినట్లు సమాచారం. ఇద్దరి ముఖకవళికలు ఒకేలా ఉండటంతో పాటు, ఒకే రకమైన దుస్తులు ధరించి ఈ ప్లాన్ అమలు చేశారు. అయితే రెండోసారి ఎత్తు కొలిచినప్పుడు 169.6 సెం.మీ.గా నమోదైంది. మొదటిసారి కంటే ఉన్నట్టుండి ఎత్తు 3.2 సెం.మీ. పెరగడం అధికారులకు తీవ్ర అనుమానం కలిగించింది.
దీంతో అధికారులు పాత ఫొటోలను చూసి గుర్తింపును సరిపోల్చారు. ఇద్దరి పోలికలు అచ్చుగుద్దినట్లు ఒక్కటే కావడంతో అసలు విషయం వెంటనే కనిపెట్టలేకపోయారు. కానీ ఆ తర్వాత బయోమెట్రిక్ పరీక్ష నిర్వహించగా.. వేలిముద్రలు, ఐరిస్ (కంటిపాప) వివరాలు మ్యాచ్ కాలేదు. దీంతో పరీక్షకు వచ్చింది అసలు అభ్యర్థి భూపేంద్ర కాదని, అతని స్థానంలో వచ్చిన కవల సోదరుడు భూపేష్ అని తేలిపోయింది. ఎత్తు తక్కువగా ఉందని ముందే తెలియడంతో ఇద్దరూ కలిసి ఈ కుట్ర పన్నినట్లు విచారణలో అంగీకరించారు.
ఈ మోసం బట్టబయలు కావడంతో, పరీక్షా కేంద్రం బయట వేచి ఉన్న భూపేంద్రను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారి నుంచి మొబైల్ ఫోన్లు, గుర్తింపు కార్డులు, విద్యా ధ్రువపత్రాలు సహా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకేలాంటి రూపాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను బోల్తా కొట్టించాలనుకున్న కవలల ఎత్తుగడను.. చివరకు పెరిగిన ఎత్తు తేడా, బయోమెట్రిక్ పరీక్ష వెలుగులోకి తెచ్చాయి.

Leave a Reply