హైదరాబాద్: భాగ్యనగరంలో ఒక మహిళపై జరిగిన అమానుష ఘటన సంచలనం సృష్టిస్తోంది. ప్రేమ పేరుతో వంచించి, మతం మార్చి, పెళ్లి చేసుకున్న మొదటి రోజే డ్రగ్స్ ఇచ్చి భర్తతో పాటు మరో ఐదుగురు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఒక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బలవంతపు మత మార్పిడి, లైంగిక వేధింపులు, మోసం మరియు బెదిరింపులతో కూడిన ఈ కేసు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ అయ్యింది.
అసలేం జరిగింది? బాధితురాలు ఏమని ఆరోపించింది?
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, కూకట్‌పల్లిలో తనకున్న షాపును అద్దెకు తీసుకునే నెపంతో నవాజ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
- పేరు మార్చుకుని మోసం: తాను హిందూ మతంలోకి మారానని, తన పేరు ‘నవదుర్గ’ అని నమ్మించి ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. దీనికి అతని కుటుంబ సభ్యులు కూడా వత్తాసు పలికారు.
- రిసార్ట్‌లో దారుణం: మే 2025లో తన కుటుంబ సభ్యులను కలుస్తావని ఆమెను ఒక రిసార్ట్‌కు తీసుకెళ్లి, అక్కడ ఆమెకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో అసభ్యకరమైన ఫోటోలు తీసి, పెళ్లి చేసుకోకపోతే వాటిని బయటపెడతానని బెదిరించాడు.
- బలవంతపు పెళ్లి: భయపడిన సదరు మహిళ జూలైలో అతడిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వారిద్దరూ బేగంపేటలోని ఒక అద్దె ఇంట్లో ఉండేవారు.
పెళ్లి తర్వాత నరకం.. గ్యాంగ్ రేప్ ఆరోపణలు:
పెళ్లి తర్వాత కూడా వేధింపులు ఆగలేదని బాధితురాలు వాపోయింది.
- మత మార్పిడి: హిందువుగా నమ్మించిన నవాజ్, పెళ్లి తర్వాత ఆమెను ‘నజీరా’గా మార్చి బలవంతంగా కల్మా చదివించాడు. శాకాహారి అయిన ఆమెతో బలవంతంగా గొడ్డు మాంసం తినిపించాడని ఆమె ఆరోపించింది.
- సామూహిక అత్యాచారం: పెళ్లి జరిగిన మొదటి రాత్రి తన భర్తతో పాటు అతని ఐదుగురు స్నేహితులు (మున్నావర్, సోహైల్, చిన్ను, షారూఖ్, ఇస్మాయిల్) తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
- అమానుషం: ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించడమే కాకుండా, తన సోదరుల ముందే తన బట్టలు చింపి అవమానించేవాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది.
పోలీసుల దర్యాప్తు – ఆరుగురు పరారీ:
ఈ ఏడాది జనవరిలో నవాజ్ అదృశ్యం కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. మొదట మిస్సింగ్ కేసుగా భావించిన పోలీసులు, బాధితురాలు తనపై జరిగిన దారుణాలను వివరించడంతో ఏప్రిల్ 4న కూకట్‌పల్లిలో ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేశారు. అనంతరం ఈ కేసును బేగంపేట పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.
ప్రస్తుతం పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 70(1) (గ్యాంగ్ రేప్), సెక్షన్ 123 కింద కేసు నమోదు చేశారు. నిందితులు నవాజ్, మున్నావర్, సోహైల్, చిన్ను, షారూఖ్ మరియు ఇస్మాయిల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
